Field visit | కోల్ సిటీ, అక్టోబర్ 23: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని జనగామ గ్రామంలో గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జక్కుల కాంతారావు క్షేత్ర పర్యటన చేశారు. రైతులతో కలిసి గ్రామంలో సాగు చేస్తున్న వరి పంటలను పరిశీలించారు. వరి గింజలు పాలు పోసుకునే దశలో ఉండటంతో ఈ సమయంలో సుడి దోమల ప్రభావం అధికంగా ఉంటుందని ఆయన అన్నారు. సుడి దోమల నివారణకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఎకరాకు బుప్రోఫిజెన్ 320 మి.లీ లేదా డైనోటెప్యూరాన్ 80 గ్రా.ల లేదా పైమెట్రోజెన్ 120 గ్రా.ల 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు. అలాగే వరి పంటలపై కంకినల్లి నియంత్రణకు స్పైరోమెసిఫిన్ మందు 150 మి.లీ నీటితో కలిపి పిచికారి చేయాలని తెలిపారు. ఈ జాగ్రత్తలతో పంట నష్టంను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే.ప్రకాశ్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు.