కరీంనగర్ విద్యానగర్, డిసెంబర్ 21: కన్నతండ్రే కాలయముడయ్యాడు. కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి.. తానే తప్పుదారి పట్టాడు. వావివరుసలు మరిచి, కోడలితో సంబంధం పెట్టుకొని.. అడ్డుస్తొన్న కొడుకును కడతేర్చేందుకు కోడలితోనే స్కెచ్ వేశాడు. సుపారి గ్యాంగ్‌తో అంతమొందించి, తప్పించుకునే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, మామకోడళ్ల తీరును పసిగట్టి కేసును ఛేదించారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్‌లోని రూరల్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ విజయ్‌కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి, నిందితుల అరెస్ట్ చూపారు. కేసు వివరాలు వెల్లడించారు.
రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య (36), శిరీష (33) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. అయితే అంజయ్య ఉపాధి కోసం 2017లో విదేశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో అతని తండ్రి లచ్చయ్య (63), తన కోడలు శిరీషతో సంబంధం పెట్టుకున్నాడు. అంజయ్య 2019లో తిరిగి వచ్చాడు. అప్పుడు తండ్రి, తన భార్య మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి వారిని మందలించాడు. అప్పటి నుంచి పలుసార్లు గొడవలు జరిగాయి. అయితే తమ బంధానికి అడ్డుగా ఉన్న అంజయ్యను వదిలించుకోవాలని తండ్రి, భార్య స్కెచ్ వేశారు. నేరుగా చంపితే అనుమానం వస్తుందని భావించిన లచ్చయ్య, అదే గ్రామానికి చెందిన కొలిపాక రవి సాయంతో సుపారి గ్యాంగ్‌ను సంప్రదించాడు.
ఈ క్రమంలో రవి తన బంధువైన ఉప్పరపల్లి కోటేశ్వర్, అతని స్నేహితుడు మహమ్మద్ అబ్రార్‌ను కలిసి అంజయ్యను చంపేందుకు 3 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత కోటేశ్వర్, అబ్రార్ కలిసి అంజయ్యతో స్నేహం పెంచుకున్నారు. కొద్ది రోజులుగా అతనితో కలిసి మద్యం తాగుతున్నారు. ఈ నెల 2న మద్యం తాగుదామని అంజయ్యను ఊరి చివర కెనాల్ సమీపంలోకి పిలిచారు. అక్కడ అతనికి అతిగా మద్యం తాగించారు. మత్తులోకి జారుకున్న తర్వాత కోటేశ్వర్ గొంతు నులమగా, అబ్రార్ చేతులు పట్టుకుని అంజయ్యను హతమార్చారు. నిందితుడు రవి దగ్గరుండి ఈ విషయాన్ని లచ్చయ్యకు చేరవేశాడు. సాక్షాలు దొరక్కుండా మృతదేహాన్ని డీ-8 కెనాల్లోకి పడేయగా, ఈ నెల 5న అంజయ్య మృతదేహం కనిపించింది.
ప్రమాదవశాత్తూ పడి చనిపోయాడని నమ్మించేందుకు నిందితులు ప్రయత్నించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే మామాకోడళ్ల వ్యవహార శైలిపై పోలీసులకు అనుమానం రాగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. లోతుగా విచారించగా, అసలు నిజం బయటపెట్టారు. సుపారి గ్యాంగ్‌తో హత్య చేయించినట్టు తెలిపారు. దీంతో అంజయ్య తండ్రి గాదె లచ్చయ్య, భార్య శిరీష, సుపారి హంతకులు ఉప్పరపల్లి కోటేశ్వర్(31), మహమ్మద్ అబ్రార్(23), మధ్యవర్తిత్వం వహించిన కొలిపాక రవి (55)ను అరెస్ట్ చేశారు. వారి వద్ద ఫోన్లు, బైక్‌తోపాటు సుమారు 40వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేసును చాకచక్యంగా ఛేదించిన చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్, రామడుగు ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.