ఎన్నో ఆశలతో వానకాలం సేద్యానికి సిద్ధమైన రైతులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తాకుతున్నది. సీజన్ మొదలై నెల దాటినా గట్టి వాన లేక, మొగులుకేసి చూడాల్సి వస్తున్నది. ఇప్పటికే నార్లు పోసుకుంటున్న కొందరు రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తుండగా, ఎల్నినో ప్రభావంతో అసలు పడుతాయో.. లేదో తెల్వక అయోమయ స్థితిలో పడ్డారు. కొందరు ట్యాంకర్లతో కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా.. మెజార్టీ రైతులు నార్లు పోసుకునేందుకు వెనకడుగువేస్తున్నారు. మరోవైపు జూన్ మొదట్లో వేసిన పత్తి విత్తనాలు నీళ్లు లేక అవి మట్టిలోనే మాడిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే సర్కారు ముందు చూపుతో వ్యవహరించి, ప్రాజెక్టులను నింపితే ఈ దుస్థితి వచ్చేది కాదని చెబుతున్నారు.
-కరీంనగర్, జూలై 2 (నమస్తే తెలంగాణ)
వానకాలం పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్నినో ప్రభావంతో చినుకుజాడ కరువైంది. సీజన్ మొదలై నెల దాటినా ఆశించిన వర్షాల్లేక ఆందోళన పెరుగుతున్నది. దుక్కులు దున్ని అంతా సిద్ధం చేసుకున్నా.. వానలు లేక పరిస్థితి అయోమయంగా మారింది. వరి నార్లు పోసుకునేందుకు రైతులు ముందుకు రావడం లేదు. బావులు, బోర్లలో నీటి వనరులు అనుకూలంగా ఉన్న రైతులు కొందరు నార్లు పోసుకుంటుండగా, కనీసం 60 నుంచి 70 మిల్లీ మీటర్ల వర్షం వరుసగా పడితేనే పంటలు సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల అక్కడక్కడా కురిసిన ఒకట్రెండు జల్లులకు పత్తి విత్తుకున్నా రైతులకు నిరాశే ఎదురవుతున్నది.
అవి మొలకెత్తక.. మొలకెత్తినా మాడిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. వానకాలం సీజన్లో రెండు ప్రధాన పంటలైన వరి, పత్తి సాగుకు ఇప్పటి వరకు ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిజానికి కరీంనగర్ జిల్లాలో చూస్తే జూన్ 27 వరకు జిల్లా సగటు వర్షపాతం 99 మిల్లీ మీటర్లు. కానీ, ఈ జూన్లో కేవలం మూడు రోజులే వాన పడింది. మూడు, నాలుగు మండలాల్లో కలిపి చూస్తే 55.5 మిల్లీ మీటర్లుగా నమోదైంది. గంగాధర, రామడుగు మండలాల్లో మాత్రమే చెప్పుకోదగ్గ వర్షం కురిసింది.
మిగతా మండలాల్లో నామమాత్రంగా నమోదైంది. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతాయని అధికారులు చెబుతున్నారు. నిజానికి జూన్, జూలైలో వర్షాలు అనుకూలిస్తాయని మొదట అంచనా వేశారు. కానీ, అందుకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తుండడంతో అయోమయం చెందుతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్లో డ్రైస్పెల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని, రైతులు స్వల్పకాలిక పంటలు సాగు చేసుకుంటే మంచిదని సూచిస్తుండగా, సీజన్ ఆరంభంలోనే వర్షాలు లేక పోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.
వానకాలం సీజన్లో వ్యవసాయ శాఖ సిద్ధం చేసిన ప్రణాళిక అమలయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఈ సీజన్లో కరీంనగర్ జిల్లాలో 3,44, 420 ఎకరాల్లో పంటలు సాగు చేయవచ్చని అధికారుల అంచనా. అందులో అత్యధికంగా 2.79 లక్షల ఎకరాల్లో వరి, 48 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుందని పేర్కొన్నా.. పత్తి విత్తుకునేందుకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూలైలో ఆశించిన వర్షాలు పడితేనే వరి సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటా యి. ఇప్పుడు పోసుకున్న నారు సమయానికి నాట్లు వేయకుంటే అక్కరకు రాకుండా పోయే ప్రమాదమున్నది. ఈ నేపథ్యం లో నార్లు పోసిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. చాలా మంది నార్లు పోసుకునేందుకు ముందుకు రావడం లేదు.
కేసీఆర్ పాలనలో నిత్యం నీటితో కళకళలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తిగా వెలవెల బోతున్నాయి. ఎల్నినో ప్రభావం ఉంటుందని ప్రభుత్వానికి ముందు హెచ్చరికలు వచ్చినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించుకుని మధ్యమానేరు, దిగువ మానేరు రిజర్వాయర్లను ఎత్తిపోతల ద్వారా నింపుకుంటే ఇప్పుడు పంటలకు పుష్కలంగా నీరిచ్చే అవకాశం ఉండేది. కానీ, ఎత్తిపోయకపోవడంతో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. దిగువ మానేరు జలాశయంలో ప్రస్తుతం తాగునీటికే గోసపడే ప్రమాదం పొంచి ఉంది. 24.034 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 5.864 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
అందులో అత్యధికంగా డెడ్ స్టోరేజీనే ఉంటుంది. కరీంనగర్ నగరంతోపాటు మిషన్ భగీరథ కింద జిల్లాలోని పలు మండలాలకు తాగునీటి అవసరాల కోసం ఈ నీటిని సంరక్షించాల్సి ఉంటుంది. వర్షాలు అనుకూలిస్తే తప్పా సాగుకు నీరు వదిలే పరిస్థితి లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ కూడా అడుగంటుతున్నది. 27.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో 7.4 టీఎంసీలే ఉన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వానలు ఆలస్యమైనా ప్రాజెక్టుల నుంచి నీళ్లివ్వడంతో ఏ గోసా రాలేదని గుర్తు చేస్తున్నారు. కానీ, కాంగ్రెస్ సర్కారు ముందు చూపులేక తాము ఇబ్బంది పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
మృగశిర కార్తె తర్వాత రోజు ఒక్క వాన పడితే పత్తి గింజలు వేసిన. మొలకలు తిరిగినయి. కానీ ఇప్పటివరకు ఒక్క వాన పడలే. ఎండలు దంచికొడుతున్నయి. ఈ సారి కాలమే అర్థమైతలేదు. తడిలేక మొలకలన్నీ ఎండిపోతున్నయి. ఎకరాకు రూ.5వేలపైనే పెట్టుబడి పెట్టిన. అదంతా మునుగుడే.
ఈ సారి ముందుగానే తొలకరి పలకరించడంతో సంబురపడ్డ. నాకున్న రెండెకరాలతోపాటు మరో పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పెట్టిన. ఇప్పటివరకు ఒక్క వాన కూడా పడలే. అక్కడోటి అక్కడోటి మాత్రమే మొలక అచ్చింది. మిగిలిన విత్తులన్నీ భూమిలోనే మాడిపోయినయి. ఇట్లా అయితదని అనుకోలె. మళ్లీ దుక్కి దున్ని విత్తనాలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
– తీపిరెడ్డి భూంరెడ్డి, యువరైతు, మామిడిపల్లి (కోనరావుపేట)