యూరియా కోసం రణం సాగుతున్నది. రోజుల తరబడి ఎదురుచూసినా ఒక్క బస్తా దొరక్కపోవడం, అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో కర్షకుల కడుపుమండుతున్నది. రెండు నెలలుగా గోస తీరకపోవడం, కొరత ఇంకా తీవ్రమవుతుండడంతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఎక్కడికక్కడ రోడ్డెక్కుతూ ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నది. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని మండిపడుతున్నది. చివరికి రామడుగు మండలం వెదిరలో కాంగ్రెస్ నాయకులే రైతులతో కలిసి రోడ్డెక్కి రాస్తారోకో చేయడం పరిస్థితికి అద్దంపడుతున్నది.
చిగురుమామిడి/ జూలపల్లి / రాయికల్, సెప్టెంబర్ 9 : యూరియా కోసం రెండు నెలలుగా తిరుగుతున్న రైతులు, కడుపు మండి రోడ్డెక్కుతున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేశారు. కరీంనగర్-హుస్నాబాద్ రహదారిపై బైఠాయించి, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించారు. 450 మందికిపైగా రైతులకు యూరియా కూపన్లిచ్చి వారం గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క బస్తా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ కాగా, ఎస్ఐ సాయికృష్ణ ఆందోళన విరమింపజేసేయత్నం చేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి, యూరియా కూపన్లున్న రైతులందరికీ రెండు రోజుల్లో పంపిణీ చేయిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని పెద్దాపూర్ బస్టాండ్లో యూరియా లారీని రైతులు అడ్డుకున్నారు. స్థానిక గోదాంలో 225 బస్తాలు దింపి మరో 225 బస్తాలు కుమ్మరికుంటకు తరలిస్తుండగా అడ్డగించారు. సరిపడా యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. మొత్తం బస్తాలు ఇక్కడే దింపాలని పట్టుపట్టారు. చివరకు పోలీసుల జోక్యంతో లారీని వదిలి పెట్టారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అయోధ్యలో రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోగా, ఎస్ సుధీర్ రావు అధికారులతో మాట్లాడి యూరియాను అందిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే ఆయాచోట్ల సర్కారు తీరుపై రైతులు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎన్నడూ గోస పడలేదని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ఇరువై నెలల పాలనలోనే అరిగోస పడుతున్నామని ఆవేదన చెందారు. ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదని హితవు పలికారు.
నేను నాలుగెకరాల్లో నాటేసిన. యూరియా కోసం 30 రోజుల సంది తిరుగుతున్న. నాలుగుసార్లు పొద్దంతా లైన్ కడితే నాలుగు బస్తాలు దొరికినయ్. ఒక్కో బస్తా తీస్కపోయి ఏ మడిలో సల్లాలో తెలుస్తలేదు. వరి పొట్టకు వస్తున్నది. ఇప్పుడు సల్లక పోతే దినం మించిపోతుంది. ఇగ పంట కూడా సక్కగ పండదు. అందరికీ అన్నం పెట్టే మా రైతులకు సర్కారు సున్నం పెడుతున్నది. రైతులను గింత గోసపెడితే ఎట్ల? అడ్డగోలు పెట్టుబడి పెట్టి మేం ఎట్లా బతికేది?
నాకు ఎకరం భూమి ఉన్నది. తొమ్మిదెకరాలు కౌలుకు తీసుకున్న. మొత్తం వరి వేసిన. యూరియా కోసం తిరుగుతున్న. ఎక్కడా దొరుకతలేదు. తంగళ్లపల్లి గ్రోమోర్ షాపునకు నేను పొద్దుగాల్ల ఆరున్నరకే వచ్చిన. అప్పటికే ఇక్కడ మస్తు మంది ఉన్నరు. లైన్లో నిల్చున్న. ఒక్క యూరియా బస్తా టోకెన్ ఇచ్చిన్రు. నాకున్న పదెకరాలకు ఒక్క బస్తా ఎట్ల సరిపోతది? మళ్లెప్పుడు ఇస్తరో..? అని ఎదురుచూసుడే అయితంది.