ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. సర్కారు నిర్లక్ష్యం.. ధాన్యం సేకరణలో అలసత్వాన్ని అవకాశంగా మలుచుకొని రెచ్చిపోతున్నారు. సెంటర్లను ఆక్రమించి ధాన్యాన్ని తక్కువ ధరకే (క్వింటాల్‌కు రూ.1800) కొంటూ మిల్లర్లకు అమ్మేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వేలాది క్వింటాళ్ల ధాన్యం మధ్యవర్తుల పాలుకాగా, కొనుగోళ్లలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో విధిలేని పరిస్థితుల్లో రైతులూ అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనతో మిల్లర్లు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడమే కారణంగా కనిపిస్తుండగా, జరుగుతున్న నష్టాన్ని చూసి రైతాంగం ఆవేదన చెందుతున్నది. కడుపు మండి ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నది.
కరీంనగర్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)/ గంగాధర: కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు తమ ధాన్యం విక్రయించుకునేందుకు మునుపెన్నడూ లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వానకాలం సీజన్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడగా, దీనిని ఆసరా చేసుకుంటున్న దళారులు ఏకంగా ప్రభుత్వం గుర్తించిన కొనుగోలు కేంద్రాల్లోనే అడ్డా వేస్తున్నారు. క్వింటాల్‌కు రూ.1,800 నుంచి రూ.1,850 చెల్లించి కొనుగోలు చేస్తూ, మిల్లర్లకు విక్రయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాలు ఏ గ్రేడు ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 ప్రకటించింది. దళారులు చెల్లించే ధరకు కనీస మద్దతు ధరకు ఒక్క క్వింటాలుపై రూ.500 వ్యత్యాసం కనిపిస్తోంది. అంటే ఒక్క 20 క్వింటాళ్లు దళారులకు విక్రయించిన రైతు రూ.10 వేలు నష్టపోవాల్సి వస్తోంది.
గత నెల 14 నుంచి ఎమ్మెల్యేలు, అధికారులు అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. దాదాపు అన్ని చోట్లా ప్రారంభించిన అధికారులు, ఇప్పటి వరకు కొనుగోళ్లు మాత్రం మొదలు పెట్టలేదు. గత నెల మొదటి వారంలోనే కోతలు నిర్వహించుకున్న రైతులు, కేంద్రాల్లోనే ఆరబెట్టుకుంటూ విసిగి పోతున్నారు. ఇప్పటికే కొనుగోళ్లు జరిగితే ముందుగా కేంద్రాలకు వచ్చిన రైతుల చేతికి డబ్బులు వచ్చేవి. అయితే, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసిన దళారులు రంగ ప్రవేశం చేసి ఎక్కడ బడితే అక్కడ విచ్చల విడిగా ప్రభుత్వం ద్వారా ఐకేపీ, ప్యాక్స్, హాకా, డీసీఎంఎస్ కేంద్రాలను అడ్డాలుగా మార్చుకుని యథేచ్ఛగా కొనుగోళ్లు జరుపుతున్నారు. దళారులు తక్కువ ధరకు కొనుగోలు జరుపుతున్నా జిల్లా అధికార యంత్రాంగాలు చేష్టలుడికి చూస్తున్నాయి.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత సేపూ ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందని, ఇంకా ఆరబెట్టిన తర్వాత కొనుగోళ్లు జరుపుతామని ఆయా జిల్లాల అధికారులు చెబుతున్నారు. కానీ, వాస్తవం మరోలా కనిపిస్తోంది. నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాకుండా మిల్లర్లతో ప్రభుత్వం తగువు పెట్టుకోవడం వల్ల కొనుగోళ్లకు వారు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు మిల్లర్లతో జిల్లాల వారీగా అగ్రిమెంట్లు కూడా జరుగనట్లు సమాచారం. ఒక్కో ఏరియాలో కొన్ని మిల్లులను ప్రభుత్వం అలాట్ చేసే ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంతో ధాన్యం కొనుగోలు చేసి ఎక్కడ నిలువ చేసేదని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే, శనివారం నుంచి కరీంనగర్ జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. మిల్లులు అలాట్ కానప్పటికీ ఆయా ఏజెన్సీల వరకే ఈ ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ధాన్యం కొనుగోళ్లు సకాలంలో జరగకపోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు తక్షణమే జరపాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. పలు ప్రతిపక్ష పార్టీలు కూడా రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి. ముందు నుంచే రైతన్నలకు అండగా ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.
ఇది గంగాధర మండలం కురిక్యాలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ధాన్యం కొనుగోలు కేంద్రం. గతంలో రైతులు ఇక్కడి కేంద్రంలో సకాలంలో ధాన్యం విక్రయించుకుని ధీమాగా ఉండేవారు. డబ్బులు కూడా సకాలంలో బ్యాంకు ఖాతాల్లో పడేవి. కానీ, ఈసారి ఈ గ్రామ రైతులు తమ ధాన్యం విక్రయించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గత నెల 16న ప్యాక్స్ ఆధ్వర్యంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచే రైతులు ధాన్యం తెచ్చి కుప్పలుగా పోసుకున్నారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క ధాన్యపు గింజనూ కూడా కొనలేదు. ఇక్కడి రైతుల పరిస్థితిని చూసి దళారులు రంగ ప్రవేశం చేశారు. రూ.1,850 క్వింటాల్ చొప్పున కొంటామని ముందుకు వచ్చారు. ప్రభుత్వం కొనకపోవడంతో తీవ్రంగా విసిగి పోయిన రైతులు, విధి లేని పరిస్థితుల్లో దళారులకు తెగనమ్ముకుంటున్నారు. ఇప్పటికే ఈ కేంద్రానికి 6 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం రాగా, ఇప్పటివరకు 4 వేల క్వింటాళ్లు అమ్ముకున్నారు. దళారులు యథేచ్ఛగా ఈ కేంద్రంలోనే తూకం వేసుకుని సుమారు 20 లారీల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కురిక్యాలలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులైతంది. ఎమ్మెల్యే సారు కొబ్బరికాయ కొట్టి పొయ్యినంక మళ్ల ఎవ్వలు ఇటువైపు రాలేదు. కొనేటోళ్లు లేరు. గన్నీ సంచులిచ్చేటోళ్లు లేరు. రాత్రి పూట కుక్కలు వడ్లను చిందరవందర చేస్తున్నయి. సర్కారు వడ్లు కొనేతట్టులేదు. చేసేదేం లేక వడ్డీకీ పావుశేరు లెక్క దళారులకు అమ్ముకుంటున్నం.
– మడుపు గోపాల్‌రెడ్డి, రైతు, కురిక్యాల
కురిక్యాల వడ్ల కేంద్రంలో ధాన్యం ఎవ్వలు కొంటరో తెలుస్తలేదు. ఎప్పుడు కొంటరో చెప్పెటోళ్లు లేరు. వడ్ల కాడికి అచ్చి చూసినోళ్లు లేరు. ఇప్పటి వరకు కేంద్రంలో కాంట వెయ్యలేదు. వడ్లు కొనలేదు. రెండు సారు వడ్లు తడిసి మొలకలత్తున్నయి. ఇట్లను ఉంటే పరిస్థితి చేయిదాటి పోతది. ఏం చేయాలో అర్థంకాక సేటును బతిలాడి వడ్లు అమ్మిన. ఇసోంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు.
– అబ్బిడి చంద్రారెడ్డి, రైతుల, కురిక్యాల
కేసీఆర్ సారు ఉన్నప్పుడే మంచిగుండె. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అచ్చినంక ఏం మంచిగ అనిపిస్తలేదు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు కేంద్రంలో వడ్లు జెప్పన కొని తీసుకుపోతుండేది. ఇప్పుడు 20 రోజుల సంది పడిగాపులు పడుడైతంది. వానలకు వడ్లు కాపాడుకునుడు కష్టమైతంది. జెప్పన వడ్లు కొని రైతులను ఆదుకోవాలే.
– కెంచ సూరవ్వ, మహిళా రైతు, కురిక్యాల