గంభీరావుపేట/ కొడిమ్యాల/ వీర్నపల్లి/ గన్నేరువరం, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవం రోజూ రైతులు యూరియా కోసం తిప్పలు పడ్డారు. శుక్రవారం ఉదయం నుంచే బారులు తీరి పడిగాపులు గాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో గోదాంకు గురువారం రాత్రి 225 బ్యాగుల లోడ్ రాగా, ఉదయం నుంచే సుమారు 350 మంది తరలివచ్చారు. లైన్లో నిలబడే ఓపిక లేక కొంత మంది తమ చెప్పులు, చెప్పులు వేసుకొని రాని మరికొంత రైతులు బండరాళ్లను పెట్టారు. పెద్ద సంఖ్యలో రావడంతో పోలీస్ పహారా మధ్యన ఒక్క బస్తా చొప్పున పంపిణీ చేశారు. అయితే ఉదయం నుంచి లైన్లో ఉన్నా ఒక్క బస్తా కూడా దొరకకపోవడంతో ఆగ్రహించారు. సుమారు రెండు వేల బస్తాల వరకు అవసరమున్న సింగిల్ విండో పరిధిలోని రైతులకు కేవలం 225 బస్తాలు పంపిణీ చేసి చేతులు దులుపుకోవడం ఏంటని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూర్ గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 444 బ్యాగుల యూరియా రాగా, ఉదయమే రైతులు తరలివచ్చారు.
పాస్ బుక్, ఆధార్ కార్డుల జిరాక్స్‌లతో క్యూలైన్లో వేచి ఉన్నారు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే ఇవ్వగా, గంటల తరబడి లైన్లో పడిగాపులు గాశారు. అంత ఓపికతో ఉన్నా ఎకరానికి ఒక్క బస్తా ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని సింధూర మండల సమాఖ్య ఫర్టిలైజర్ షాపునకు 220 బ్యాగులు రాగా, రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే 270కి అమ్మాల్సిన బ్యాగును 290 విక్రయిస్తుండడంతో ఆగ్రహించారు. ఈ విషయమై ఏవో జయను ఫోన్లో సంప్రదించగా, అధిక ధరలకు విక్రయించవద్దని ఐకేపీ ఏపీఎం, సీసీకి చెప్పారు. తర్వాత రైతులు మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి వెళ్లారు. ఉదయం 8 గంటల నుంచే క్యూలో నిరీక్షించారు. గంటల పాటు లైన్లో ఉంటే రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే ఇచ్చారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి డీసీఎంఎస్‌కు రైతులు బారులు తీరారు. సరిపడా దొరకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.