కొత్తపల్లి, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందని, రైతులకు అన్ని రకాలుగా నష్టం చేసిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కొత్తపల్లి మండలంలో మలాపూర్, బద్దిపల్లి గ్రామాలలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సీజన్లా కాకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన రెండు, మూడు రోజుల్లోనే వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, రైతులు ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైన వడ్లను తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో వరికోతలకు ఇంకా సమయం పడుతుందని, అయితే కాంగ్రెస్ ప్రభు త్వం ఇప్పటికే సాగునీటిని నిలిపివేయడంతో సుమారు 500 ఎకరాలు నీరందక ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ సీజన్లో ఎండిన వరి పంటకు 500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో చివరి తడి వరకు నీరిచ్చామని, సమృద్ధిగా నీళ్లు ఉన్నందున సమృద్ధిగా పంటలు పండి ధాన్యం దిగుబడులు అధికంగా వచ్చేవన్నారు. ఒకానొక సందర్భంలో పంట పొలాలకు సాగునీరు వద్దని రైతులు విజ్ఞప్తి చేసిన సందర్భాలు బీఆర్ఎస్ హయాంలో ఉంటే, పంటలకు నీరందక ఎండిపోయిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందన్నారు.
కరీంనగర్ ప్రజలకు తాగునీటికి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మలాపూర్ను నగరపాలక సంస్థలో విలీనం చేయడం ద్వారా ఉపాధి హామీ కూలీలకు పనిలేకుండా పోయిందని గ్రామస్తులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. అలాగే, రైతుబంధు రాలేదని, సబ్సిడీ గ్యాస్ అందడం లేదని, తులం బంగారం ఇవ్వడం లేదని, కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసిందని వివరించారు.
అంతకు ముందు కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి వచ్చిన గంగులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, మాజీ జడ్పీ కో అప్షన్ సభ్యులు సాబీర్ పాషా, మాజీ ఎంపీటీసీలు పండుగ గంగమ్మ నర్సన్న, లసుమయ్య, ఉప్పు శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, సుడా మాజీ డైరెక్టర్ నేతి రవివర్మ, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్ అప్పుడే మంచిగున్నది
కాంగ్రెసోళ్ల పింఛన్లు పెంచలేదు. రైతు బంధు ఇయ్యలేదు. రుణమాఫీ చేయలేదు. ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరితోపాటు రైతులను మోసం చేసింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండే. నాకు రైతు బంధు ఎప్పుడు ఆగలేదు. రుణమాఫీ కూడా అయింది. ఇప్పుడు రైతులకు ఏమీ ఇయ్యడం లేదు. మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతుల బతుకులు బాగుపడుతయ్.
– గొల్లపల్లి ఈరయ్య, రైతు, మల్కాపూర్