రాయికల్, మే 22 : కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను వెంటనే కొనాలని రాయికల్ మండలంలోని ఆలూరు, వీరాపూర్, రాజనగరం రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాయికల్ మండల కేంద్రంలోని ఉప్పుమడుగు శివారులోని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దాదాపు 3 గంటలపాటు అక్కడే బైఠాయించారు. సర్కారుకు వ్యతిరేకంగా నినదించారు. మరో వారంలో రోహిణీ కార్తె ప్రారంభం కాబోతుందని, సాగు పనులు ప్రారంభమవుతాయని, ఇంకెప్పుడు వడ్లు కొంటారని ప్రశ్నించారు.
సరిపడా గన్నీ సంచులు లేక, సరైన సమయానికి లారీలు రాక పోసిన ధాన్యం కల్లాల్లోనే ఉందని ఆవేదన చెందారు. వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోగా, ఎస్ఐ సుధీర్‌రావు అక్కడకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ఈ ధర్నాలో రైతులు నల్లాల స్వామిరెడ్డి, దుండిగాల రామస్వామి, భారతపు రాజేశ్, సురతాని మల్లారెడ్డి, దుంపల స్వామిరెడ్డి, రాంరెడ్డి, రాజశేఖర్, రాజమల్లు, స్వామి, నర్సారెడ్డి, అంజన్న తదితరులు పాల్గొన్నారు.