ముస్తాబాద్, అక్టోబర్ 14 : సర్కారు నిర్లక్ష్యం రైతులకు శాపంలా మారుతున్నది. గతేడాదిలాగే ధాన్యం కొనుగోళ్లలో జరిపిన జాప్యంతో నష్టపోయే ప్రమాదం ఏర్పడుతున్నది. ఇప్పటికే వానకాలం సీజన్ కోతలు మొదలైనా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయకపోవడంతో రైతులు మునిగే పరిస్థితి కనిపిస్తున్నది.
సోమవారం రాత్రి పడిన వర్షంతో ముస్తాబాద్ మండలం లోని ఆవునూరు, రామలక్షణపల్లె, తుర్కపల్లి గ్రామాల్లోని కేంద్రాల్లో పోసిన వడ్లు తడువగా, కాపాడుకొనేందుకు రైతులు తంటాలు పడ్డారు. స్వయంగా రైతులే టార్ఫాలిన్లు అద్దెకు తెచ్చుకొని కుప్పలపై కప్పే ప్రయత్నం చేశారు. అయితే, భారీ వర్షం కావడంతో వడ్లు తడిసిపోగా, కంటతడి పెట్టారు. కొనుగోళ్లను వెంటనే చేపట్టి రైస్‌మిల్లులకు తరలించాలని వేడుకున్నారు.