Organic fertilizers | పెద్దపల్లి రూరల్ జూన్ 27: వ్యవసాయ సాగులో రైతులు రసాయనిక ఎరువులవాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచితే అధిక దిగుబడులతో కూడిన లాభాలుంటాయని పెద్దపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి కాంతాల అలివేణి అన్నారు. జిల్లా కేంద్రంలోని మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో పలువురు రైతులతో శుక్రవారం సమావేశమై రసాయన ఎరువుల వల్ల నష్టాలు, సేంద్రియ ఎరువుల వల్ల కలిగే లాభాలను ప్రయోగాత్మకంగా వివరించారు.
రసాయనిక ఎరువులకు బదులుగా జీవన ఎరువులైన బ్యాక్టీరియా పిఎస్ బీ ని వాడాలని కోరారు. రెండు కిలోల పిఎస్ బీ ని పది నుంచి 20 కిలోల సేంద్రియ ఎరువు లేదా పొడి పశువుల పేడ లో కలుపుకొని ఒక ఎకరం భూమిలో సమానంగా చల్లుకుంటే రైతులకి లాభదాయకంగా ఉంటుందన్నారు. రసాయనక భాస్వరం ఎరువులను సగం నుండి పూర్తిగా తగ్గించుకోవచ్చన్నారు. అజో స్పైరిలం బ్యాక్టీరియా పొడిని రెండు కిలోలని 20 కిలోల పశువుల పేడ లేదా సేంద్రియ ఎరువుల్లో లేదా వర్మీ కంపోస్టులో కలుపుకొని ఒక ఎకరా పొలానికి చల్లుకున్నట్టయితే యూరియా వాడకాన్ని దాదాపుగా సగానికి తగ్గించుకోవచ్చన్నారు.
రైతులందరూ ఎప్పటికప్పుడు వ్యవసాయ విస్తీర్ణాధికారులను సంప్రదిస్తూ లాభదాయకమైన సాగు యాజమాన్య పద్ధతులను చేపట్టాలన్నారు. వీటికి సంబంధించినటువంటి ప్రయోగాత్మక ప్రదర్శన రైతు వేదికలలో త్వరలో చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులంతా తప్పనిసరిగా రైతు రిజిస్ట్రీని చేసుకోవాల్సిందిగా కోరారు.