Veenavanka | వీణవంక, ఏప్రిల్ 4: రైతులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడారు.
దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు గుర్తింపు దక్కడం లేదని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఓ కార్యక్రమంలో వ్యక్తం చేసిన అభిప్రాయాల కనుగుణంగా జాతీయ స్థాయిలో త్వరలో హైదరాబాద్లో రైతు సంఘాల నేతలు, మేధావులతో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఆ సదస్సులో కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు.
పారిశ్రామీకరణ పెరిగి వ్యవసాయం అంటరాని వృత్తిగా మారడం, రైతులను చిన్నచూపు చూడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేపట్టబోయే ఉద్యమ పంథా దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించబోతోందని రామారావు విశ్వాసం వ్యక్తం చేశారు.