గోదావరిఖని, సెప్టెంబర్ 6 : కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని.. రేవంత్రెడ్డి పాలన రైతులకు కన్నీళ్లు పెట్టిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన నివాసంలో పాలకుర్తి మండలం తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నెరిమట్ల పెద్ద మల్లేశం, నెరిమట్ల శ్రీనివాస్, నెరిమిట్ల రాయపోషం, మిట్ట రాజయ్య, తీగల స్వామి బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం చందర్ మాట్లాడారు. గత ఎన్నికల్లో అభయహస్తం పేరుతో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. నాడు కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పాలనలో అరిగోస పడుతున్నదన్నారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు చెప్పలేనివన్నారు.
ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుతున్నట్లు తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రోడ్డు వెడల్పు పేరుతో ప్రస్తుత ఎమ్మెల్యే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు చరమగీతం పాడుతారని చెప్పారు. ఇక్కడ నాయకులు మల్కల కొమురయ్య, బండి శ్రీనివాస్, నారాయణదాసు మారుతి, ండి శ్రీనివాస్, చెలకలపల్లి శ్రీనివాస్, రాజన్న, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.