CHIGURUMAMIDI | చిగురుమామిడి, ఏప్రిల్ 12: మండలంలో వరి కోతలు మొదలయ్యాయి. రైతులు యంత్రాలతో పంట కోసి కల్లాలకు ఐకెపి, సింగిల్ విండో కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. వాతావరణం మార్పులలో అకాల వర్షాలు కురుస్తున్నాయని ఆందోళనతో రైతులు ఉన్నారు. ఇప్పటికే 10 నుండి 15 శాతం పంటలు కోతలు కాగా, మరో 15 రోజుల్లో 40 శాతం కోతలు పూర్తి కానున్నాయి. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రాంతాల్లో రైతుల ధాన్యం రాశులు పోసుకొని కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు.
ఏర్పాటుకు అధికారుల చర్యలేవి…?
చిగురుమామిడి మండలంలో 20 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. సుమారు 49 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గతంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం( సింగిల్ విండో) ద్వారా 8 గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముల్కనూరు, రామంచ, గునుకుల పల్లె, సుందరగిరి, నవాబుపేట, బొమ్మనపల్లి, రేకొండ, సీతారాంపూర్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, మహిళా సంఘాల ద్వారా (సెర్ప్- ఐకెపి) ఆధ్వర్యంలో చిగురుమామిడి, బొమ్మనపల్లి, ఇందుర్తి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి పనులు చేపట్టలేదు. కేంద్రాల్లో గన్ని సంచులు, తూకం వేసే, తేమ కొలిచే, తూర్పార పట్టే యంత్రాలను సమకూర్చడం, విద్యుత్తు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు తదితర పనులు చేపట్టలేదు. అధికారులు రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినబడుతున్నాయి. రెవెన్యూ తాసిల్దార్ సత్వరమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులతో మాట్లాడాలని మండల రైతులు కోరుతున్నారు.
ఆలస్యమైతే దళారులదే హవా..!
ఇప్పటికే మండలంలోని ఉల్లంపల్లి, నవాబ్ పేట్, సుందరగిరి, కొండాపూర్ తదితర గ్రామాల్లో 250 ఎకరాల వరకు వరి కోతలు పూర్తయ్యాయి. చాలామంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని భావిస్తుండగా, మరికొందరు రైతులు వేచి చూడలేక ప్రయివేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరిగితే దళారుల హవా పెరుగుతుందని రైతులు వాపోతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నం..
– నాగేల్లి రాజిరెడ్డి, రైతు, లంబాడి పల్లి
వారం రోజుల క్రితమే 250 ఎకరాల వారి కోతలు పనులు పూర్తయ్యాయి. గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీ కేంద్రాల ఏర్పాటు చేసే ప్రాంతాల్లో రైతులు ధాన్యం రాశులు పోసేందుకు సిద్ధమవుతున్నారు. నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ లేకుండా ఆరబెట్టి సిద్ధం చేశారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. సత్వరమే అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి.
అధికారుల ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం
– ముద్దసాని రమేష్, తహసీల్దార్
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేపట్టాం. సింగిల్ విండో, సెర్ప్ ఐకెపి, వ్యవసాయ శాఖ, మిల్లర్స్ లకు శిక్షణ కార్యక్రమం పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నాం. వరి కోతలు జరుగుతున్న ప్రాంతాల్లో వెంటనే కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. జిల్లా అధికారుల ఆదేశాల కోసం వేచి చూస్తున్నాము. ఆదేశాలు రాగానే వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తాం.