ధర్మపురి/ కోరుట్ల రూరల్, ఫిబ్రవరి 20 : యాసంగి పూట యూరియా కష్టాలు తీవ్రమయ్యాయి. రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేమితో సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా దొరకడం లేదు. ఇందుకు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, కోరుట్ల మాదాపూర్ సహకార సంఘాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ధర్మపురి మండలం జైన సహకార పరపతి సంఘం గోదాముకు వారం రోజులుగా యూరియా రావడం లేదు. గురువారం 340 బస్తాల లోడ్ వచ్చినా 25శాతం రైతులకు కూడా సరిపోలేదు. యూరియా పంపిణీ టైంలో రైతులు ఎగబడ్డారు. అధికారులు పోలీసుల సాయంతో పంపిణీ చేయాల్సి వచ్చింది.
అందరికీ అందకపోవడంతో రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పలుకుబడి ఉన్నోళ్లకే బస్తాలు ఇస్తున్నారని, ఇదెక్కడి పద్ధతి అంటూ పలువురు రైతులు హమాలీలతో గొడవకు దిగారు. ఇక కోరుట్ల మండలం మా దాపూర్లోని ప్రాథమిక సహకార సంఘ కార్యాల యం వద్ద యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు. పట్టా పాసు పుస్తకాలతో సహకార సంఘం వద్ద టోకెన్ల కోసం క్యూలైన్ కట్టారు. రోజంతా పడిగాపులు కాసినా కొందరికే యూరియా అందడంతో మిగిలిన వారు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు పూర్తిస్తాయిలో స్టాక్ తెప్పించకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు.