UREA | చిగురుమామిడి, ఆగస్టు 25: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయం ఎదుట కరీంనగర్, హుస్నాబాద్ రహదారిపై రైతులు సోమవారం బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాళ్లు అరిగేలా యూరియా కేంద్రాల చుట్టూ తిప్పుకుంటున్నారని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ప్రభుత్వం తీరుకు నిరసనగా రైతులు నినాదాలు చేశారు. యూరియా సరఫరా లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాచారం తెలుసుకున్న ఎస్సై సాయికృష్ణ రాస్తారోకోను విరమించాలని రైతులను కోరినప్పటికీ రైతులు సమేమిరా అనడంతో అధికారులు హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని వారు డిమాండ్ చేశారు. మండల వ్యవసాయ అధికారి రమ్యశ్రీ సంఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. మరో యూరియా లోడు రాగానే రైతులందరికీ యూరియా అందేలా చేస్తారని హామీ ఇచ్చారు.
యూరియా కోసం రైతుల క్యూ
సింగిల్ విండో కార్యాలయానికి సోమవారం యూరియాలోడు రావడంతో సమాచారం తెలుసుకున్న రైతులు వెంటనే క్యూలో నిల్చొని యూరియా కోసం ఎదురుచూశారు. సుమారుగా 700 మందికి పైగా రైతులు క్యూలో నిల్చొంటే 230 బస్తాల యూరియా వచ్చింది. ఇందులో కేవలం 125 మందికి ఉన్న యూరియా ఇవ్వడంతో క్యూలో నిల్చున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్సై సాయి కృష్ణ, ఏవో రమ్యశ్రీ రైతులతో మాట్లాడి 225 మంది క్యూలో ఉన్న రైతులకు టోకెన్లు ఇప్పించారు. మరో లారీ యూరియా లోడ్ రాగానే ముందుగా టోకెన్లు ఉన్న రైతులకు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం సరైనది కాదని రైతులు ప్రభుత్వం, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.