రైతన్న నిర్మించుకున్న కల్లాలపై కేంద్రం కండ్లు మండించుకుంటున్నది. వారి మెడపై ఉపాధి హామీ కత్తి పెడుతోంది. పంట ఉత్పత్తులు ఆరబోసేందుకు నిర్మించుకున్న కల్లాలకు చెల్లించిన బిల్లులు వెనక్కి ఇవ్వాలని హుకుం జారీ చేస్తోంది. అప్పుడు ఎందుకు అవకాశం ఇచ్చింది… ఇపుడు ఎందుకు నిధులు వెనక్కి ఇవ్వాలంటున్నదని రైతాంగం కేంద్రంపై మండిపడుతున్నది. రైతుల కల్లాలు నిర్మించాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పేర్కొనలేదని కేంద్రం ఇప్పుడు మొండి వాదనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండేళ్ల క్రితం నిర్మించిన కల్లాలకు చెల్లించిన నిధుల విషయమై ఇపుడు చర్చ జరుగుతోంది. మరోవైపు గుట్టల ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణ కోసం తవ్వే కందకాలపైనా కేంద్రం ఆంక్షలు విధిస్తోంది.
కరీంనగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అంటేనే వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో మంట రగిల్చి చలికాగుతోంది. 2020 జూన్‌లో రైతులు తమ పొలాల్లో పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు (డ్రయర్ ప్లాట్ ఫామ్స్) కల్లాలు నిర్మించుకోవచ్చని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు రూపొందించి కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌లో అప్పట్లోనే అప్లోడ్ చేసింది. నిబంధనల ప్రకారం డ్రయర్ ప్లాట్ ఫామ్స్ ఎన్ఆర్ఈజీఎస్లో లేనట్లయితే అప్పుడే అభ్యంతరం చెప్పాల్సి ఉండేది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు తమ పంట పొలాల్లో కల్లాలు నిర్మించుకున్న రెండేళ్ల తర్వాత అభ్యంతరం చెప్పడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. గత జూలైలో కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు జిల్లాలో జరిగిన ఉపాధిహామీ పనులపై దండ యాత్ర చేశాయి. ఈ బృందాల పరిశీలనలో సిమెంట్ కల్లాలు నిర్మించుకున్నట్లు తేలడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సదరు బృందాలు నివేదించాయి. దీంతో రైతులు నిర్మించుకున్న కల్లాలకు చెల్లించిన బిల్లులు వెనక్కి తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడంతో జిల్లాలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటి సంరక్షణ కందకాలపై ఆంక్షలు
వాన నీటి సంరక్షణ కోసం తవ్వే కంటూరు కందకాలపైనా కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని అనేక గ్రామాల్లోని గుట్టల ప్రాంతాల్లో కందకాలు తవ్వి వాన నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. ఈ పనులకు కూడా రాష్ట్ర అధికారులు అంచనాలు రూపొందించి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండానే మంజూరు చేశారు. గత జూలైలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందాలు సందర్శించినపుడు నీటి సంరక్షణ కోసం తవ్విన కొన్ని కందకాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి గుట్టపైనే కందకాలు తవ్వాలనే నిబంధన ఈజీఎస్‌లో ఎక్కడా లేనట్లు పలువురు స్పష్టం చేస్తున్నారు. కానీ, తెలంగాణలో ఈ తరహా పనులు ఎక్కువగా జరగడంతో ఏదో విధంగా రాష్ట్రంపై కొర్రీలు పెట్టి నిధులు తగ్గించాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఇలాంటి అనైతిక చర్యలకు దిగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరహాలో కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో పెద్ద సంఖ్యలో కందకాలు తవ్వారు. ఇవన్నీ కేంద్రం చూపిన నిబంధనల ప్రకారమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఏటవాలు ప్రాంతాల్లో కందకాలు తవ్వుకునే పరిస్థితి లేకుండా పోయింది. అటవీ సంరక్షణలో భాగంగా కూడా ఈ పనులు చేపట్టే అవకాశం ఉండేది. కానీ, కేంద్రం కొర్రీల కారణంగా ఇప్పుడు ఇందుకు విరుద్దంగా జరగవచ్చు.
366 కల్లాల నిర్మాణం పూర్తి
గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించి వారి జీవనోపాధిని మెరుగుపర్చే లక్ష్యంతో 2005 ఆగస్టులో ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో విధంగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో కనిపిస్తున్నదనే ఆరోపణలు వచ్చాయి. మొదట్లో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ఉపాధి పనులు జరిగాయి. క్రమంగా కేంద్ర ప్రభుత్వం పనులు, నిధుల్లో కోతలు, కొర్రీలు పెట్టడంతో దీని ప్రాభావం తగ్గింది. వ్యవసాయాన్ని ఉపాధిహామీతో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వ చెవికెక్కకపోగా రైతుల కోసం ఖర్చు చేసిన నిధులను వెనక్కి ఇవ్వాలని హుకుం జారీ చేస్తోంది. రైతులు తమ పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు నిర్మించుకున్న సిమెంట్ కల్లాల నిధులను తిరిగి చెల్లించాలని స్పష్టం చేస్తోంది.
2020 ఆగస్టులో ఈ సిమెంట్ కల్లాల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. మూడు విభాగాల్లో వీటి నిర్మాణం చేపట్టింది. 50 చదరపు మీటర్ల వెడల్పుతో నిర్మించిన వాటికి రూ.56 వేలు, 60 చదరపు మీటర్లలో నిర్మించుకున్న వారికి రూ.68 వేలు, 75 చదరపు మీటర్లలో నిర్మించుకున్న వారికి రూ.75 వేలు చెల్లించారు. ఈ మేరకు కరీనగర్ జిల్లాలో రూ.2.37 కోట్లు వెచ్చించి 366 సిమెంట్ కల్లాలను నిర్మించారు. పెద్దపల్లి జిల్లాలో 600ల కల్లాలకు రూ.4.93 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాలను చేపట్టారు. ఎస్సీ రైతులకు పూర్తి ఉచితంగా, బీసీ ఇతర రైతులకు 10 శాతం కంట్రిబ్యూషన్‌తో నిర్మించారు. ఇవి కూడా ఈజీఎస్ కార్డు ఉండి, స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికే మంజూరు చేశారు. జిల్లాలోని అనేక మండలాల్లో రైతులు వీటిని నిర్మించుకున్నారు.
కల్లాల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా రైతులు కల్లాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. ఇదివరకు రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు ఉపాధి హమీ పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లాల నిర్మాణాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం వద్దంటూ నిబంధనలు పెట్టడం సరికాదు. దీంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై పున పరిశీలన చేసి ఉపాధి హామీ ద్వారా కల్లాలు ఏర్పాటు, కందకాలు, ట్రెంచ్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి.
– మెరుగు రాజేశం, మండల రైతు బంధు సమితి కన్వీనర్(బీర్పూర్ మండలం)
అభివృద్ధిని అడ్డుకునే కుట్ర
రోజుకో కొత్త నిబంధన పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను అడ్డుకునేందుకే కేంద్రం కుట్రలు చేస్తున్నది. రైతులకు ఎంతో ఉపయోగపడేందుకు వ్యవసాయ కల్లాలు నిర్మించుకున్నారు. ఇప్పుడు కొత్తగా కేంద్రం ఈ పథకానికి వెచ్చించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని ఆదేశించిడం నిజంగా సిగ్గుచేటు. గ్రామాల్లో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సహంగా ఉన్న సమయంతోలో కేంద్రం కందకాల పనులకు ఉపాధిహామీ నిధులు వాడరాదని ఆదేశాలు ఇవ్వడం సరికాదు. నిబంధనల పేరిట రైతులను ఇబ్బందులు గురిచేస్తే ప్రజలే సరైన గుణపాఠం చెబుతారు.
– వంచె రాజు, యువరైతు(కథలాపూర్)
మోదీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, సాగు నీరు, రైతు బంధు లాంటి పథకాలతో ఇక్కడి రైతు చేతి నిండా పంటలు పండించకుంటున్నడు. కానీ రైతులు ఉపాధి హామీ పథకం ద్వారా కల్లాలు నిర్మించుకుంటుంటే కేంద్రం నిధుల్లో కోత విధించడం సరైన పద్ధతి కాదు. కేంద్రంలో మోదీ సర్కారు చేస్తున్న మోటర్లకు మీటర్లు పెడతామనడం, ఎరువులకు సబ్సీడిని తగ్గించడం, ధాన్యాన్ని కొనబోమని చెప్పడం లాంటి పనులన్నీ తెలంగాణ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యల్లో భాగమే. ఈ పద్ధతి మార్చుకోవాలి.
– మారం జగన్మోహన్ రెడ్డి, మండల రైతు సంఘం నాయకులు(వెల్గటూర్)
కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు వీడాలి
కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను వీడాలి. ఉపాధి హామీ పథకం కింద రాయితీపై నిర్మిస్తున్న వ్యవసాయ కల్లాలకు ఉపాధి హామీ నిధులను నిలిపివేయడం విచారకరం. పూర్తిస్థాయిలో వ్యవసాయ కల్లాల నిర్మాణం జరగకపోవడం వల్లే రైతులు తమ పంట దిగుబడులను రోడ్లపై ఆరబోయాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే కేంద్రం ఇలాంటి వైఖరిని అవలంబిస్తున్నది. ఇలాంటి నిర్ణయాలతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కేంద్రం నిధుల నిలిపివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.
– అడప రాజ్‌కుమార్, రైతు, రాజేశ్వర్రావుపేట, మెట్పల్లి మండలం
రైతులు ఊరుకుంటరా..?
ఉపాధి హామీ పథకంలో రైతులకు ఉపయోగపడే పనుల్లో ఇదొకటి. ఇసొంటి పనిని చేయించుకుని మళ్ల పైసలు వాపసు తీసుకుంటమని చెప్పుడు ఎంత వరకు కరెక్ట్. ఏ ప్రభుత్వమైనా రైతులకు మేలు చేయాల్నని చూడాలెగానీ రైతులు వాడుకున్న పైసలు వాపసు ఇవ్వాల్నని ఎట్ల అంటది. సిమెంట్ కల్లాలు రైతులకు మంచిగ ఉపయోగపడుతున్నయి. ఇవి ఒక్క వడ్లు బోసుకునేతానికేకాదు. అన్ని రకాల దినుసులు ఆరబోసుకోవచ్చు. అవసరం అనుకుంటే కల్లంలనే స్టాక్ చేసుకోవచ్చు. ఇంత మంచి పనిని రద్దు చేసుడుగాదు. ప్రోత్సహించాలే. ప్రతి రైతు చేన్ల కట్టియ్యాలే. కేంద్రం నిర్ణయం తప్పు. నిధుల రికవరీ అంటే రైతులు ఊరుకోరు..
– గుజ్జుల రవిందర్ రెడ్డి, రైతు, రామకృష్ణకాలనీ (తిమ్మాపూర్ మండలం)
కల్లాలకు నిధుల కుదింఫు అక్షేపణీయం
ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు కల్లాలు నిర్మించుకుంటుంటే కేంద్రం నిధుల్లో కోత విధించడం ఆక్షేపనీయం. కేంద్రప్రభుత్వం ఉపాధినిధుల్లో రాష్ర్టాల ప్రమేయం లేకుండా నేరుగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, చిన్న, సన్నకారు రైతులకు తీవ్రంగా నష్టం కలుగుతుంది. పంట కల్లాల మంజూరు, బిల్లుల చెల్లింపు ప్రక్రియను నిలిపివేసి కేంద్రం రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే నల్లచట్టాలను తెచ్చిన కేంద్రప్రభుత్వం రైతాంగం నిరసనలు, దీక్షలతో వెనుకడుగు వేసింది. ఉపాధిహామీ నిధుల విషయంలోనూ కేంద్రం దిగొచ్చే దాకా రైతాంగం ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
– బద్దం రాంచంద్రారెడ్డి, రైతు, ముత్యంపేట(మల్యాల)
రైతులపై కేంద్రం అక్కసు
రైతులపై కేంద్రం ప్రభుత్వం ఇంకా అక్కసు వెల్లగక్కుతూనే ఉంది. కల్లాల నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు వాడరాదని ఆదేశాలివ్వడమనేది వ్యవసాయం రంగంపై, రైతులపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తున్నది. ఉపాధి హామీ నిధులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేది సీఎం కేసీఆర్ ప్రధాన ఆలోచన. దీంతో రైతులకు ప్రధానంగా పెట్టుబడి భారం తగ్గుతుంది. ఈ రోజుల్లో గ్రామాల్లో కల్లాలు అతిపెద్ద సమస్య. ఉపాధిహామీ నిధులతో కల్లాలు నిర్మించుకుంటే రైతులకు వడ్లు, ఇతర పంటలను కూడా ఆరబోసుకునే అవకాశం ఉంటుంది. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోస్తే విపరీతమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిని నివారించేందుకే రైతులు కల్లాలు నిర్మించుకోవాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. అలాగే అడవుల సంరక్షణకు కందకాల తవ్వడం వల్ల అడవులు, వణ్యప్రాణులను సంరక్షించినవారమవుతాం. ఇంతమంచి కార్యక్రమాలకు ఉపాధినిధులు వాడరాదని కేంద్రం ఆదేశాలివ్వం అవగాహన లోపమే. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– ఏఎంసీ చైర్మన్ రాజేశ్‌కుమార్(ధర్మపురి)
కొర్రీలు పెట్టడం సరి కాదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు కల్లాలను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీని అందిస్తూ ప్రోత్సహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టడం సరికాదు. ఉపాధి హామీ పథకం ద్వారా అందించే నిధులను ఉపసంహరించుకొని కేంద్రం రైతులను వంచించే విధంగా వ్యహరిస్తున్నది. రైతులపై కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రం నిధులను ఇవ్వకుండా నిబంధనలు పెడుతున్నది.
– ఒజ్జెల బుచ్చిరెడ్డి, మున్నూరుకాపు మెట్పల్లి సంఘాల ఉపాధ్యక్షుడు (మారుతీనగర్)