Almaspur | ఎల్లారెడ్డిపేట, జూలై 13: రుతు పవనాల రాకకు ముందుగానే మురిపించిన వానలు జూలై రెండోవారం దాటినా ముఖం చాటేయడం ఓ వైపు, బోరుబావులతో సాగు చేద్దామనుకుంటే కరెంటు లేక, రాక అధికారులకు చెప్పి విసుగెత్తి నిరసన తెలిపిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గత మూడు రోజుల క్రితం అల్మాస్ పూర్ శివారులోని ఓ ట్రాన్స్పార్మర్ చెడిపోయింది.
దానికి 23 శాంక్షన్డ్ మోటార్లు ఉండగా సుమారు 60 ఎకరాల భూమి సాగవుతున్నది. వర్షం కొంచెం, కొంచెం పడటంతో వచ్చిన కరెంటుతో బోరు బావితో దున్నకం మొదలు పెట్టారు. ఎకరానికి రూ.8వేలు ఖర్చు పెట్టి దున్నిస్తే కరెంటు లేక పోవడంతో మల్లీ పొలమెండిపోయి మల్లీ దున్నే పరిస్థితి ఎదురైంది. వచ్చే కరెంటు సైతం ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఆ గ్రామ రైతులు అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోక పోవడం తో ఆదివారం నిరసన చేపట్టారు.
ఇక్కడ రైతులు ఉచ్చిడి శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి, నాగెల్లి రాజిరెడ్డి, పెద్దూరి శ్రేనివాస్, పెద్దూరి పర్శరాములు, మట్ట సత్తిరెడ్డి, దానవేణి పర్శరాములు ఉచ్చిడి నారాయణరెడ్డి, చింతల్ ఠాణ లచ్చయ్య తదితరులు ఉన్నారు.