Husnabad | సైదాపూర్ : మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లిలో యూరియా కోసం రైతులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో గోపాల్‌రెడ్డి అనే రైతుతో పాటు పలువురు అన్నదాతలకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని వెన్నంపల్లి సహకార సంఘానికి యూరియా వస్తుందన్న సమాచారం మేరకు పలు గ్రామాల నుండి రైతులు ఉదయమే చేరుకున్నారు.
మద్యాహ్నం మూడు గంటల సమయంలో లోడ్ వచ్చింది. కాగా వెన్నంపల్లి, ఎక్లాస్పూర్ గ్రామాలకు చెందిన రైతులు అక్కడకు భారీగా చేరుకున్నారు. తమ గ్రామానికి యూరియా కావాలంటే తమ గ్రామానికి యూరియా కావాలంటు వాగ్వివాదానికి దిగారు. దీంతో వెన్నంపల్లి సంఘం ముందు తీవ్ర ఉద్రికత్త నెలకొంది. కొద్ది సేపు వాగ్వివాదం తరువాత ఇరు గ్రామాల రైతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్ది సేపు ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితి నెలకొంది.
రైతులు కట్టెలు, బండరాయిలతో దాడికి దిగారు. కాగా రైతుల దాడిలో సహకార సంఘంలోని అద్దాలు ధ్వంసం కాగా వెన్నంపల్లి గ్రామానికి చెందిన రైతు గోపాల్‌రెడ్డి అనే రైతుకు గాయాలు కాగా పలువురు రైతులకు స్వల్పగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపతి వెన్నంపల్లికి చేరుకుని రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.