మంథని/మంథని రూరల్, జూలై 13: దశాబ్దాలుగా తమ పొలాల వద్దకు వెళ్లే చెరువుకట్ట, రహదారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలని మంథని మండలం బిట్టుపల్లి రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం చెరువుకట్ట రహదారిని మళ్లీ పునరుద్ధరించే పనులను ప్రారంభించగా, కబ్జాదారులు వచ్చి అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించగా, రైతులంతా మంథనికి చేరుకొని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు.
అనంతరం గోడు వెల్లబోసుకున్నారు. బిట్టుపల్లి శివారులోని సర్వే నంబర్ 116లోని 217ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందని, కాకర్లపల్లి, సూరయ్యపల్లి, ధర్మారం, సీతంపల్లి, బిట్టుపల్లి, ఎక్లాస్పూర్, నెల్లిపల్లి గ్రామాల్లోని వేలాది ఎకరాలకు ఈ చెరువు నీరే ఆధారమని చెప్పారు. ఈ చెరువు కట్టను ఆనుకొని ఉన్న రోడ్డుపై నుంచే రైతులు దశాబ్దాలుగా తమ పొలాలకు వెళ్తున్నామన్నారు. అయితే 30 మీటర్ల వెడల్పుతో సుమారు 200 మీటర్లకు పైగా పొడువు ఉన్న ఈ దారితోపాటు చెరువు కట్టను కొందరు తమ భూమిలో కలుపుకున్నారని ఆరోపించారు.
ఈ కబ్జా భాగోతంపై గత సోమవారమే ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని, రెవెన్యూ అధికారులు కబ్జా స్థలం వద్దకు వెళ్లి పంచనామా నిర్వహించి పనులు నిలిపి వేయాలని ఆదేశించినా, కబ్జాదారులు పట్టించుకోలేదని చెప్పారు. అందుకే తామే వచ్చి పునర్నిర్మించే పనులు ప్రారంభించామని వివరించారు. అధికారులు వెంటనే స్పందించి చెరువు కట్ట, రహదారిని కబ్జా చేసిన వారిని వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి ధర్నా విరమింప జేసే ప్రయత్నం చేసినప్పటికీ సఫలం కాలేదు. మంథని తహసీల్దార్ రాజయ్య రైతులతో ఫోన్లో మాట్లాడారు. సోమవారం వరకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు.