రాజన్న సిరిసిల్ల, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరల తయారీ కోసం కేటాయించిన యారన్ సబ్సిడీ నిధులు వెంటనే విడుదల చేయాలని నేతన్నలు డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బుధవారం రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. డిమాండ్లను పరిష్కరించాలని కార్యాలయ ఏవోకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ, సిరిసిల్ల పట్టణ, టెక్స్టైల్స్ పార్క్లో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించి పదిశాతం యారన్ సబ్సిడీ నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం కార్మికులపై నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుందన్నారు. 2023 సంవత్సరానికి సంబంధించి యారన్ సబ్సిడీ 5,200 మందికి కార్మికులకు 3వేల మంది ఖాతాలో జమ చేసిందని, ఇంకా 2,200మంది నేతన్నల ఖాతాలో జమ చేయలేదన్నారు.
సిరిసిల్ల ప్రాంత కార్మికులే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇతర రాష్ర్టాల కార్మికులు బతుకమ్మ చీరలతో ఉపాధి పొందుతున్నారన్నారు. కాలయాపన చేయకుండా సబ్సిడీ డబ్బులు వెంటనే విడుదల చేసి, నేతన్నలకు అండగా నిలువాలని కోరారు. కాగా బీవైనగర్లో ఉన్న చేనేత జౌళీశాఖ కార్యాలయాన్ని కలెక్టర్ కార్యాలయానికి తరలించడంపై నిరసన వ్యక్తం చేశారు.
కార్మిక క్షేత్రంలో కార్యాలయం ఉండి, అధికారులు అందుబాటులో ఉంటే కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవన్నారు. తరలించిన కార్యాలయాన్ని యథావిధిగా బీవైనగర్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు నక్క దేవదాస్, కూచన శంకర్, బెజుగం సురేశ్, మూషం శంకర్, స్వర్గం శ్రీనివాస్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.