Farmers protest | పెగడపల్లి: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొటూ, శుక్రవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మండలానికి చెందిన రైతులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నా.. బస్తాలు దొరకడం లేదని రైతులు నినాదాలు చేస్తూ, ఆందోళనకు దిగారు. పంటల సాగుకు తగ్గట్లుగా ప్రభుత్వం యూరియాను అందించడం లేదని రైతులు ఆరోపించారు.
బస్తాలు సహకార సంఘంలో ఉంటే, టోకెన్లు 2 కిలోమీటర్ల పరిధిలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందజేస్తున్నారని, దీని వల్ల దూర భారంతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని రైతులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై కిరణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, సహకార సంఘం సీఈవో తడ్కమడ్ల గోపాల్ రెడ్డి అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. శుక్రవారం సహకార సంఘానికి 350 యూరియా బస్తాలు వచ్చాయని, సీరియల్ ప్రకారం రైతులందరికి అందజేస్తామని వారు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు.