కోనరావుపేట, మే 15: కేసీఆర్ పాలనలో నిరందీగా సాగు చేసిన రైతులు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన వడ్లను సకాలంలో అమ్ముకోలేక ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కుతున్నారు. కోనరావుపేట మండలం మల్కపేట రైతులు బుధవారం గ్రామ ప్రధాన రహదారి (సిరిసిల్ల – కోనరావుపేట)పై రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కేంద్రాల్లో వడ్లు పోసి నెల కావస్తున్నా ఇప్పటి వరకు సరిగా కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు.
తూకం వేసిన ధాన్యం బస్తాలు వారం గడుస్తున్నా తరలించడం లేదని, లారీల కొరత ఉందని చెబుతున్నారని, దీంతో కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఉంచాల్సి వస్తున్నదని ఆగ్రహిస్తున్నారు. వెంటనే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కొలనూర్ సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్రావు వచ్చి రైతులను సముదాయించారు. ఫోన్లో ఉన్నతాధికారులతో మాట్లాడారు. రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. సుమారు రెండు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోగా.. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
నాకున్న రెండున్నర ఎకరాల్లో వరి పంట పండించిన. నెల కిందనే వరి కోసి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన. నేను వడ్లు తెచ్చిన నెల రోజులకు ధాన్యం తూకం వేసిన్రు. తూకం వేసి వారం గడుస్తున్నా ఇప్పటివరకు మిల్లులకు తరలించలేదు. దీంతో రోజూ వడ్ల దగ్గరే కావలి ఉంటున్న. వాన పడ్డప్పుడు వడ్లపై టార్పాలిన్లు కప్పుతున్న. తర్వాత ఆరబెడుతున్న. ఇదే నాకు డ్యూటీ అయింది. నెల దాటింది. ఇంకెప్పుడు తరలిస్తరో..
-జంగిటి భూమయ్య, రైతు (మల్కపేట)