రామడుగు, ఏప్రిల్29 : ధాన్యం కొనుగోలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలో రైతులు మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్లో నెలరోజుల క్రితం ధాన్యం తెచ్చి రాశులు పోశామని, ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం రకాన్ని బట్టి ఏ గ్రేడ్, బీ గ్రేడ్, సాధారణ రకాలుగా కొనుగోలు చేసిందని, ప్రస్తుత సర్కారు రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిండా ముంచుతూ ఏ గ్రేడును కూడా సాధారణ రకంగా పేర్కొంటూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు అర్థం కాని విధంగా రాత్రికి రాత్రే కొత్త విధానాలను తెస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక రైతు నుంచి ఎకరాకు 32 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా ధాన్యం ఏంకావాలని ప్రశ్నించారు. పంట ఎక్కువ పండినందుకు సంతోషపడాలో లేక రాష్ట్ర సర్కారు ఇబ్బందులు పెడుతుంటే బాధపడాలో అర్థం కావ డం లేదన్నారు.
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఇబ్బందులను గుర్తించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, అపర భగీరథుడిలా ఊరూరికి గోదావరి జలాలను తీసుకురావడం ద్వారా రామడుగు మండలంలో ఎకరాకు 40 క్వింటాళ్ల ధాన్యం యాసంగి దిగుబడి వచ్చిందన్నారు. పంట ఎక్కువ పండినందుకు సం తోషపడాలో లేక రాష్ట్ర సర్కారు ఇబ్బందులు పెడుతుంటే బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. గతంలో జీపీఎస్ విధానం లేదని, ప్రస్తుతం సర్కా రు తెచ్చిన ఈ విధానంతో ఎవరికి లాభమో అర్థం కావడం లేదన్నారు. తక్షణమే ఈ విధానం రద్దుచేసి, ఏరోజుకారోజు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలకు పైగా ఎండలో కూర్చొని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక వ్యవసాయ మార్కెట్ అధికారులతో పాటు సింగిల్‌విండో సిబ్బంది, పోలీసులు రైతుల వద్దకు చేరుకొని నిరసన విరమింపజేయాలని కోరారు.
దీనిపై గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యంతో వ్యవసాయ మార్కెట్‌కు సంబంధం లేదని, ధాన్యం కేవలం ప్యాక్స్ మాత్రమే కొనుగోలు చేస్తుందన్నారు. వ్యవసాయ మార్కెట్లో రైతులకు మౌలిక వసతులను ఏర్పాటు చేయడం తప్ప తా ము చేసేదేమీలేదన్నారు. ప్యాక్స్ కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ జీపీఎస్ విధానం ప్రభుత్వానికి సంబంధించిందని, ధాన్యం రకాలపై పైఅధికారులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామన్నా రు. రోజుకు సుమారు ఐదారు లారీల వరకు కొనుగోళ్లు చేస్తామని హామీఇచ్చారు. ఆందోళన కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో సాయంత్రం జేసీ శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. క్వింటాల్ కు 20కట్ చేస్తున్నారని, అన్ని వడ్లు బీ గ్రేడు కిం దికే వస్తాయని రైతులతో జేసీ పేర్కొన్నారు. ఒకవేళ ఏ గ్రేడ్‌గా పేర్కొంటూ ధాన్యం విక్రయించే రైతులు సంబంధిత అధికారులతో ధ్రువీకరించి గ్రేడ్ పత్రా న్ని తీసుకురావాలని సూచించడంతో పలువురు రైతులు జేసీ ముందే అసహనం వ్యక్తం చేశారు.
నాకున్న ఆరున్నరెకరాల పొలంల మొత్తం వరే ఏసిన. పదిహేను ట్రాక్టర్ లోడ్లకంటె ఎక్కువ వడ్లు పండినయ్. కోసింది కోసినట్టు సీదా బీట్లకే తీసుకపొయ్యిని. పదిహేను రోజుల కింద వడ్లు పోసిన. పదిరోజుల కిందనే మ్యాచర్ వచ్చింది. ఇగ గొంటరు అగ గొంటరు అనుకుంటె పట్టించుకున్నోళ్ళే లేరు. తెల్లారి లేత్తె వడ్లకాడికే పొయ్యి కూసుంటున్న. నాకంటె ముందుగాల్నే మస్తుమంది రైతులు వడ్లు తెచ్చి పోసుకున్నరు. కొంతమందిదైతే నెలకిందనే పోసిండ్రు. ఇప్పటిదాకా గోపాల్రావుపేట నుంచి ఒక్క లారినే మిల్లుకు పంపిండ్రు. ఈ సర్కారోళ్ళు జేసిన పనికి చొప్పదండి మిల్లు కు పోయిన లారీ ఆన్నే ఆగిపోయింది. రోజొ క్క తీరు చెప్తండ్రు. అంత ఒక్కటే రకమని, అమ్ముతె అమ్ముండ్రి లేకపోతె లేదని. గింత అన్యాయం ఉంటదా దునియమీద. రైతుల్ని నిండా ముంచుడేనా. నా వడ్ల కాడికి వచ్చేసరికి ఇంక మూడో నాలుగో రోజులైతదట.