న్యూఢిల్లీ, జూలై 27 : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఖాతాదారుల సున్నితమైన సమాచారం లీకైంది. ఏకంగా 1 టెరాబైట్ (టీబీ)కు సమానమైన డాటా ఆన్లైన్లో అందరికీ అందుబాటులోకి రావడం సంచలనం సృష్టిస్తున్నదిప్పుడు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల నుంచి ఖాతాదారుల పేర్లతోపాటు వారి అకౌంట్, ఫోన్, ఆధార్ నెంబర్లు, రుణాలు తదితర వ్యక్తిగత, కార్పొరేట్ బ్యాంకింగ్ వివరాలన్నీ డార్క్ వెబ్పై ప్రత్యక్షమయ్యాయి మరి. దీన్ని బ్యాంక్ సైతం ధ్రువీకరించింది.
కాగా, ఓ ఉద్యోగి ఈ-మెయిల్ ఖాతాను హ్యాక్ చేసి ఈ సమాచారాన్ని దొంగిలించారని బ్యాంక్ చెప్తున్నది. అయినప్పటికీ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టామని, కీలకమైన బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ భద్రమేనని బీవోబీ పేర్కొన్నది. కాగా, ఈ డాటాను హ్యాకర్లు అమ్ముకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.