హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : యువత 21 ఏండ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు, వారు చట్టసభలకు రాకూడదా? అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచే కంటే, ముందు గా మీ చేతిలో ఉన్న యూనివర్సిటీ స్టూడెం ట్స్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. మాటలకంటే చేతలే ముఖ్యమని, విద్యార్థులు, యువతకు ఏదో మేలు చేసినవాడిలా రేవంత్‌రెడ్డి గప్పాలు కొడుతున్నారని సోమవారం ఎక్స్ వేదికగా రేవంత్‌రెడ్డి తీరుపై మండిపడ్డారు. ‘పార్లమెంట్ చట్టాలు కేంద్రం పరిధిలోనే ఉండొచ్చు, కానీ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నది. దానికి అడ్డు పడుతున్నదెవరు?. ఏ చట్టం విద్యార్థి సంఘాల ఎన్నికలను అడ్డుకుంటుందో తెలుపాలి’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. సెన్సేషన్ కోసం విశ్వసనీయత లేని మాటలు మాట్లాడకుండా, చేతల్లో చూపించాలని రేవంత్‌రెడ్డికి హితవు పలికారు.