శంకరపట్నం, ఫిబ్రవరి 10: అందుబాటులో యూరియా బస్తాలు ఉన్నా మొబైల్ యాప్‌లో బుక్ కావడం లేదని, ఈ దిక్కుమాలిన అప్లికేషన్ మాకొద్దంటూ శంకరపట్నం మండల రైతులు ఆగ్రహించారు. మంగళవారం మండలకేంద్రంలోని ఫర్టిలైజర్ షాపు ఎదుట నిరసన తెలిపారు. మండలానికి 330 బస్తాలు అందుబాటులో ఉన్నట్టు యాప్‌లో చూపుతున్నదని, ఎంత ప్రయత్నించినా బుక్ కావడం లేదని వాపోయారు. సాధారణ ఫోన్లు వాడే రైతులు ఎలా బుక్ చేసుకుంటారని ప్రశ్నించారు.
తర్వాత రోడ్డుకు పై కాసేపు ధర్నా చేశారు. అయితే యాప్‌లో యూరియా బుక్ అవుతున్నట్టు తెలిసి ధర్నా విరమించి రోడ్డు పక్కన ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లారు. యాప్‌లో రెండు నిమిషాల వ్యవధిలోనే యూరియా నిల్ అని చూపడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరిగారు. మానకొండూర్ ఏడీఏ శ్రీధర్‌ను వివరణ అడుగగా, సాంకేతిక లోపం వల్ల ఉదయం యాప్‌లో బుక్ కాలేదని తెలిపారు. తర్వాత కొద్దిసేపటికే సమస్య పరిష్కారమైందని చెప్పారు.