ధర్మపురి/పెగడపల్లి, ఆగస్టు 29 : రాష్ట్రం లో యూరియా కొరత లేదని, 25వేల మెట్రిక్ టన్నులు వచ్చిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొద్ది రోజుల క్రిత మే స్వయంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. మంత్రి చెప్పిన కొద్ది రోజలకే ఆయన ఇలాఖా ధర్మపురి నియోజకవర్గంలో కొరత వెంటాడుతున్నది. ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, ధర్మారం మండలాల్లో రైతులు రో డ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.
శుక్రవారం ధర్మపురి మండలం జైన సహకార సంఘ పరిధిలోని ఆరెపెల్లి ఎరువుల గోదాం వద్ద దాదా పు 400మంది రైతులు ఉదయం నుంచి పడిగాపులు గాశారు. ఒక్కొక్కరికి ఒక్క బాగు చొప్పున 230 మందికే ఇవ్వడంతో దాదాపు 150 మందికిపైగా యూరియా దొరకక వెనుదిరిగారు. అలాగే బుగ్గారం మండలం సిరికొండ గోదాం వద్ద కూడా దాదాపు 300 మంది రైతులు ఉదయం నుంచే పాస్‌బుక్‌లతో వేచి ఉన్నారు. ఒక్కొక్కరికి బక్క బ్యాగు చొప్పున 240 మందికి అందజేశారు. మిగతా రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెగడపల్లి మండల కేంద్రంలో అయితే రైతులు ఏకంగా ఆందోళనకు దిగారు.
స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రోజుల తరబడి తిరుగుతున్నా బస్తాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కిరణ్‌కుమార్, ఏవో శ్రీకాంత్, సహకార సంఘం సీఈవో తడ్కమడ్ల గోపాల్‌రెడ్డి అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. ఈ రోజు సహకార సంఘానికి 350 బస్తాలు వచ్చాయని, అందరికీ అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ధర్మారంలోనూ 300 మందికిపైగా నిరాశతో ఇండ్లకు వెళ్లిపోయారు.