..పక్క చిత్రంలో కనిపిస్తున్న మహిళా రైతు శంకరపట్నం మండలం కన్నాపూర్‌కు చెందిన మేకల రజిత. ఇటీవల తన గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయించి ట్రాక్టర్లో శంకరపట్నం సమీపంలోని మిల్లుకు తరలిస్తుండగా, గన్నీ బ్యాగులు చిరిగి రోడ్లపై పడిపోయాయి. సుమారు ఐదారు క్వింటాళ్ల ధాన్యం రోడ్డుపాలైంది. తిరిగి ఆ వడ్లను సంచుల్లోకి ఎత్తేందుకు పడిన కష్టాలు వర్ణనాతీతం. రోడ్డుపై వెళ్లే వాహనాల కింద పడి చాలా ధాన్యం నలిగిపోయింది. నాసిరకం, కాలం చెల్లిన గన్నీ బ్యాగుల కారణంగా ఈ దుస్థితి వచ్చిందని ఆ మహిళా రైతు వాపోయింది. రెండు రోజుల క్రితం కూడా ఇదే మండలానికి చెందిన మరో రైతుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. కొనుగోళ్లు పుంజుకుంటున్న ప్రస్తుత తరుణంలో నాణ్యమైన గన్నీ బ్యాగులు ఇవ్వాలనే డిమాండ్ రైతుల నుంచి వస్తున్నది.
కరీంనగర్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే, కొన్ని చోట్ల గన్నీ బ్యాగుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొనుగోళ్లపై అధికారుల అంచనాలు మారిన తర్వాత కరీంనగర్ జిల్లాకు 55 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, 62 లక్షలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరానికి మించి అందుబాటులో ఉన్నా ఇచ్చిన వాటిలో కాలం చెల్లినవి కూడా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. అయితే, ప్రతి సీజన్లో 54 శాతం కొత్తవి, 46 శాతం పాతవి వాడుతుంటారు. మిల్లర్ల వద్ద ఉన్న గన్నీని కూడా రిపేర్లు చేయించి తీసుకుంటారు. ఇవన్నీ పోను కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని అంచనా వేసి గన్నీ బ్యాగుల అవసరం మేరకు సమకూర్చుకుంటారు. అధికారుల వద్ద ఉన్నవి, రైస్ మిల్లర్లు ఇచ్చేవి 46 శాతం మాత్రమే పాత గన్నీ బ్యాగులు ఉండాలి.
ప్రతి సీజన్‌కు 54 శాతం కొత్త బ్యాగులు టెండర్ల ద్వారా సమకూర్చుకోవాలి. కానీ, ఈ సీజన్లో ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా పాత బ్యాగులే కనిపిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గన్నీ బ్యాగులకు ఎలాంటి కొరత లేకున్నా ఉన్నవాటిలో చాలా మట్టుకు కాలం చెల్లినవి, నాసిరకం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి వాటితో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి గన్నీ బ్యాగులు తీసుకెళ్లిన కొందరు రైతులకు చీకిపోయినవి వస్తున్నాయి. ఇవి బాగా లేవని రైతులు అభ్యంతరం తెలిపినా కొత్తవి ఇవ్వడం లేదు. నాణ్యత లేదని వాపస్ చేస్తే.. తిరిగి ఇవ్వాలంటే నాలుగైదు రోజులు పడుతున్నది.
ధాన్యం త్వరగా కేంద్రాలకు తరలించి, విక్రయించుకోవాలని చూసే రైతులు కాలం చెల్లిన బ్యాగుల్లోనే ధాన్యం నింపుకొని కేంద్రాలకు తెచ్చుకుంటున్నారు. అవి అక్కడి వరకు వస్తే గండం గడిచినట్టు భావిస్తున్నారు. కొందరు రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. మార్గం మధ్యలో ట్రాక్టర్లు కుదుపునకు గురి కావడంతో ధాన్యం బస్తాలు చిరిగి పోతున్నాయి. ఇటీవల శంకరపట్నం మండలంలోనే ఇద్దరు రైతులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. గన్నీ బ్యాగుల్లో రైతులు ధాన్యం నింపుకొని తెస్తుండగా మార్గం మధ్యలో చిరిగిపోయి విలువైన ధాన్యం రోడ్డు పాలైంది. రైతులు అష్టకష్టాలు పడి తిరిగి ఆ వడ్లను ఇతర బస్తాల్లో నింపుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లారు. కొందరు రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాల్లో తూకం వేసుకుని సొంత ట్రాక్టర్లలో మిల్లులకు తరలించుకుంటున్నారు. ఇ లాంటి రైతులు కూడా కాలం చెల్లిన గన్నీ బ్యాగుల తో అష్ట కష్టాలు పడుతున్నారు. నాలుగైదు సీజన్లలో వాడిన గన్నీ బ్యాగులనే తిరిగి ఇస్తున్నారని, కొందరు మిల్లర్లు రిపేర్లు చేయకుండానే ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే బ్యాగులు చిరిగిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఎక్కడా గన్నీ బ్యాగుల కొరత లేదు. రైతులకు, కేంద్రాలకు నాణ్యమైన గన్నీనే సరఫరా చేస్తున్నాం. ఎక్కడో చోట ఒకటి అరా చిరిగి పోయిందని నాసిరకం గన్నీ ఇస్తున్నామని అనడం సరికాదు. కొనుగోళ్లు మునుపెన్నడూ లేని విధంగా సజావుగా జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం 54 శాతం కొత్త గన్నీ బ్యాగులు తెప్పించాం. ఒక్క శంకరపట్నం మండలంలో మినహాయిస్తే ఎక్కడ ఇలాంటి ఫిర్యాదులు రాలేదు. అది కూడా ఒక్క సెంటర్ నుంచే వచ్చింది. రైతులు గన్నీ బ్యాగులు తీసుకునేటప్పడే బాగున్నాయో లేదా చూసుకోవాలి. బాగున్న బ్యాగులనే తీసుకెళ్లాలి. చిరిగి పోయినవి ఉంటే పక్కన పడేయాలి. మనకు అవసరానికి మించి గన్నీ బ్యాగులు నిల్వ ఉన్నాయి.
– రజినీకాంత్, డీఎం సివిల్ సప్లయ్స్ (కరీంనగర్)