మానకొండూర్ రూరల్, ఆగష్టు 12: కాంగ్రెస్ సర్కార్ చేతకానితనంతో యూరియా (Urea) కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. జోరు వానలు కురుస్తున్నప్పటికీ కర్షకులు ఎరువుల కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఈ రోజైనా తమకు యూరియా బస్తా దొరుకుతుందేమోనని తెల్లవారుజాము నుంచే సహకార సంఘాల వద్ద కాపుకాస్తున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడినా ఎరువులు దొరకకపోవడంతో ఉసూరుమంటు రిక్తహస్తాలతో వెనుతిరుగుతున్నారు. మానకొండూరు మండలం కొండపలకల గ్రామంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్ సొసైటీ వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయక గొడుగులు పట్టుకుని మహిళలు, రైతులు బారులు తీరారు. గంటల తరబడి నిలబడితేగానీ బస్తాలు ఇస్తున్నారు. సీఏసీఎస్ సోసైటీ ద్వారా 260 బస్తాలు రాగా ఒక్కొక్కరికీ ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు.