కరీంనగర్: ప్రభుత్వ నిర్లక్ష్యానికి అధికారులు పట్టింపులేమి తోడవడంతో యూరియా (Urea) కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా కూడా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొరగా వస్తున్న యూరియా బస్తాలు ఎవరకీ చాలడంలేదు. కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని పలు మండలాల్లో యూరియా కొరత రోజురోజుకీ తీవ్రంగా మారుతున్నది. తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, చిగురుమామిడి తదితర మండలాల్లో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తిలో యూరియా బస్తాల కోసం రైతులు క్యూలైన్లో వేచి ఉన్నారు. రైతు సహకార సంఘానికి 200 యూరియా బస్తాలు రాగా, 4 వందల మంది రైతులు వేచిఉన్నారు. దీంతో సరిపడా బస్తాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, శుక్రవారం తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ సొసైటీకి 330యూరియా బస్తాల లోడ్ రావడంతో ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. లోడు వచ్చిన గంట లోపే బస్తాలు అయిపోవడంతో మిగితా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శంకరపట్నం మండలం లింగాపూర్, కన్నాపూర్ గ్రామాలకు వచ్చిన యూరియా వెంటవెంటనే అయిపోయింది. మానకొండూర్, దేవంపల్లి సహకార సంఘాలలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు.