ఇల్లంతకుంట, మే 20 : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడాలని, వెంటవెంటే కొనాలని పొత్తూర్ గ్రామ రైతులు రోడ్డెక్కారు. పెద్దసంఖ్యలో గ్రామ జంక్షన్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. తూకంలో జాప్యం చేస్తున్నారని, జోకిన వడ్లను తీసుకెళ్లడానికి లారీలు రావడం లేదని, గన్నీ సంచుల కొరత ఉందని ఆవేదన చెందారు. కొనుగోళ్లలో వేగవంతం చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అక్కడకు చేరుకొని, ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు.
గన్నీ సంచులు లేవని, లారీలు రావడం లేదని, హమాలీల కొరత ఉందని చెప్పారు. అయినా ఎవరూ పట్టించుకొనే వారు లేక అన్నదాతలు ఆగమవుతున్నారన్నారు. అకాల వర్షాలు వెంటాడుతున్నాయని, వానకాలం దగ్గర పడుతున్నదని కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులను నిర్లక్షం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడి విరమింప జేశారు. ధర్నాలో మాజీ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కదురు శేఖర్, నాయకులు పట్నం శ్రీనివాస్, బండారి మహేశ్, రైతులు చెరుకు రాజు, నారయణ రెడ్డి, మల్లారెడ్డి, రాజయ్య, నర్సయ్య, సాంబశివ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మోహన్ రెడ్డి, గౌరయ్య, రవి, అంజయ్య, సాగర్ తదితరులు ఉన్నారు.