Peddapally | పెద్దపల్లి, ఫిబ్రవరి19: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ పత్తి ధర తగ్గించటంపై పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేయటంతో జిన్నింగ్ మిల్లుల యాజమానులు, ఖరీదుదారులు కుమ్మకై పత్తి ధర తగ్గిస్తున్నారని రైతులు అవేదన వ్యక్తం చేశారు. బుధవారం క్వింటాలుకు రూ. 7వేలు పై చిలుకు పలుకగా గురువారం రూ.5వేల ధర లభించడంతో ఒక రోజు వ్యవధిలోనే క్వింటాలుకు రూ.2వేల వరకు తగ్గించటంపై రైతులు మండిపడ్డారు.
ధర తగ్గించటాన్ని నిరసిస్తూ గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చెశారు. మద్దత ధర కంటే ఎక్కువ ధర పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రాజీవ్ రహదారిపై భైఠాయించి ధర్నా చేసేందుకు ప్రయత్నించగా, పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్‌రావు అక్కడి చేరుకొని రైతలకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి పడిగెల ప్రవీణ్‌రెడ్డి, జిన్నింగ్ మిల్లర్లు, ఖరుదుదారులు, అడ్తిదారులతో సమావేశమై పత్తి నాణ్యత బట్టి మరో సారి ధర వేయాలని సూచించారు. దీంతో ఖరుదుదారులు మరో మారు ధర వేసి కొనుగోలు చేశారు.