Sikkim Landslides : ఈశాన్య రాష్ట్రం (North Eastern State) సిక్కిం (Sikkim) లో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టు (Hydro Electric Project) సొరంగంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో సొరంగం (Tunnel) కూలిపోయి పలువురు కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అందులో మీథేన్ వాయువు (Methane Gas) లీక్ కావడంతో కొందరు ఊపిరాడక చనిపోయారు. ఇప్పటివరకు ఎనిమిది మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 12 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఇంకో 18 మందికిపైగా కార్మికులు సొరంగంలో చిక్కుకుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ సిక్కింలోని సమర్డుంగ్లో తీస్తా స్టేజ్-6 జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగంగా పటేల్ ఇంజినీరింగ్ సంస్థ ఈ సొరంగాన్ని నిర్మిస్తోంది. మీథేన్ వాయువు లీక్ వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాయువు మోతాదు ఎక్కువగా ఉండటంతో చిక్కుకుపోయిన కార్మికులు ఉన్న ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకోలేకపోతున్నాయి.
జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), సిక్కిం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సొరంగం లోపల పెద్ద పేలుడు లాంటి శబ్దం వినిపించడంతో బయటకు పరుగులు తీశామని బయటపడిన కార్మికులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే కొండచరియలు ఎందుకు విరిగిపడ్డాయన్నది ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారి సంఖ్యపై కూడా ఇంకా స్పష్టత లేదని తెలిపారు.