Rajamouli | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన భారతీయ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి తో మరోసారి ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొనగా, విదేశాల్లో నిర్వహిస్తున్న ప్రమోషనల్ ఈవెంట్లలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ఓ ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి.. సినిమా నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడారు. ముఖ్యంగా దర్శకుడిగా తాను తీసుకునే కొన్ని నిర్ణయాల విషయంలో తన కుటుంబ సభ్యులు, చిత్రబృందంతో విభేదాలు కూడా వస్తాయని ఆయన వెల్లడించారు.అలాంటి సందర్భానికి ఉదాహరణగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ‘సింహాద్రి’ చిత్రంలోని ఓ కీలక సన్నివేశాన్ని రాజమౌళి ప్రస్తావించారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘సింహాద్రి’ సినిమాలో హీరో ఒక మంచి వ్యక్తిని చంపాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. సాధారణంగా హీరో చేత అలాంటి పని చేయించడం ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే సందేహాలు తన కుటుంబ సభ్యులు, టీమ్‌లో చాలామందికి ఉన్నాయని చెప్పారు.
అయితే కథలో ఆ సంఘటన వెనుక బలమైన కారణం ఉందని, ఆ మంచి వ్యక్తిని హీరో చంపకపోతే వేలాది మంది అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆయన వివరించారు. ఆ భావోద్వేగాన్ని ప్రేక్షకులకు బలంగా చేరవేయగలిగితేనే ఆ సన్నివేశం పనిచేస్తుందని తాను నమ్మానని రాజమౌళి వెల్లడించారు. ఆ సన్నివేశాన్ని ఉంచాలా? తొలగించాలా? అనే అంశంపై కుటుంబ సభ్యులు, చిత్రబృందంతో చిన్నపాటి వాదనలు జరిగాయని రాజమౌళి చెప్పారు. చివరికి కథలోని ఎమోషన్‌ను మరింత బలంగా తెరకెక్కించడంతో ఆ సీన్ ప్రేక్షకులను కదిలించిందని, సినిమా విజయానికి కూడా అది కీలకంగా మారిందని తెలిపారు. దర్శకుడిగా కొన్ని సందర్భాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, కథ చెప్పే విధానంపై నమ్మకం ఉంటే అలాంటి రిస్క్‌లు తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ వేదికపై రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.