Rains | ఓదెల, అక్టోబర్ 25: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం పడటంతో రైతుల ధాన్యం తడిసింది. గత మూడు రోజులుగా తుఫాన్ కారణంగా వర్షాలు పడుతుండటంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుత వానాకాలం వరి పంటలు కోతకు వచ్చాయి. దీంతో వడ్లను ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రోడ్లు, మైదాన ప్రాంతాలలో పోసుకొని తేమశాతం కోసం ఆరబెడుతున్నారు. ఈ సమయంలో తుఫాన్ వల్ల వస్తున్న వర్షాలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
గత మూడు రోజులుగా మధ్యాహ్నం వేళ రైతులు వింత పరిస్థితులను అనుభవిస్తున్నారు. ఎండల తీవ్రత ఉండటంతో వడ్లను ఆరబెడుతున్నారు. ఈ క్రమంలో ఒకసారి గా వాతావరణం లో మార్పులు వచ్చి వర్షం పడుతుంది. ఐదు పది నిమిషాలు వర్షం టపటపామని పడి వెళ్లిపోతుంది. దీంతో ఆరబెట్టిన వడ్లు తడుస్తున్నాయి. ఎండ కాస్తుందని ఆరబెడితే ఒక్కసారిగా వస్తున్న వర్షం వల్ల వడ్లు తడిసిపోతున్నాయి.
ఈ పరిస్థితి మూడు రోజులుగా ఏర్పడుతుండడంతో రైతులను అయోమయానికి గురవుతున్నారు. ధాన్యం కొనుగోలును వెంటనే ప్రారంభించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శనివారం ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో వర్షం పడి ధాన్యం తడిసింది. ధాన్యం కుప్పల మీద పాలిథిన్ కవర్లు కట్టే సమయం కూడా దొరకకుండా వర్షం పడటం వల్ల పలువురు రైతుల వడ్లు తడిసాయి.