కొడిమ్యాల, నవంబర్ 16: కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో కొడిమ్యాల మండల రైతులు ఆగ్రహించారు. 40కిలోల సంచికి మూడు కిలోల చెప్పున కటింగ్ చేస్తేనే కొంటామని మిల్లర్లు చెప్పడంతో భగ్గుమన్నారు. ఆదివారం కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలోని కరీంనగర్-జగిత్యాల ప్రధాన జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, తాలు పేరిట గతంలో 40కిలోల సంచికి 2కిలోలు కటింగ్ చేసి వెంటనే ధ్యానం తూకం వేసేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం 40కిలోల బస్తాకు మూడు కిలోలు కటింగ్ చేస్తేనే కొనుగోలు చేస్తామని రైస్ మిల్లర్లు చెప్పడం ఏ మాత్రం సరికాదన్నారు.
సెంటర్ ప్రారంభంలోనే ఇలా ఉంటే.. చివరి వరకు 40కిలోల బస్తాకు ఐదు కిలోలు కట్ చేసేలా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం రైతు ఐక్యవేదిక మండలాధ్యక్షుడు ఏలేటి నర్సింహరెడ్డి మాట్లాడుతూ, కొడిమ్యాల మండలంలోని 24 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చి నెల అవుతున్నదని వాపోయారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కేంద్రాలను ప్రారంభించి 20 రోజులు అవుతున్నదని, మొదటి రోజు మాత్రమే ఒక్కో లారీ బస్తా 42కిలోల చొప్పున తూకం వేశారన్నారు. కానీ, తర్వాతి రోజు వడ్లు కొంటలేరని మండిపడ్డారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు గంట పాటు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపొయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ సందీప్ రైతులతో మాట్లాడగా వారు వినిపించుకోలేదు. తహసీల్దార్ కరుణాకర్ వచ్చి మిల్లర్లతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో వారు రాస్తారోకో విరమించారు. ఆందోళనలో రైతులు రేకులపల్లి రవీందర్‌రెడ్డి, బండ నర్సింహరెడ్డి, ఏలేటి నర్సింహరెడ్డి, రేకులపల్లి తిరుపతిరెడ్డి, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, పెద్ది రవికుమార్, మోతె మల్లారెడ్డి, అక్కనపల్లి నరేశ్, గుడిపెల్లి రాజు, రాచకొండ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల గోస తగుల్తది
నేను ఆదివారం పొద్దుగాల చెప్యాల గోపాల్రావుకు చెందిన రైస్‌మిల్లుకు రైతులతో కలిసి పోయిన. ఎందుకు కొంటలేరని అడిగిన. వాళ్లు 40కిలోల సంచికి మూడు కిలోలు కట్ చేసుకుంటమని అంటున్నరు. వెంటనే మా ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన. ‘పొద్దున్నే ఇదే పనా వయా! ఆన్ని గుంజి కొట్టున్రి’ అని అన్నడు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లనే చేసిన్రా అని ప్రశ్నిస్తే ఫోన్ కట్ చేసుకున్నడు. ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగినోళ్లకు సమస్యలు చెబితే ఫోన్ కట్ చేస్తున్నరు. ఇదేక్కడి న్యాయం? రైతులను ఇబ్బంది పెట్టిన ఏ నాయకులు బాగుపడలేదు. మా రైతుల గోస తప్పకుండా తగులతది. కటింగ్ లేకుండా వడ్లు కొనకుంటే జిల్లా స్థాయిలో ఉద్యమిస్తాం.
– రేకులపల్లి రవీందర్‌రెడ్డి, రైతు (అప్పారావుపేట)
ఇదెక్కడి న్యాయం?
దీపావళికి నాలుగైదు రోజుల ముందు వరి కోసిన. ఇప్పటి వరకు వడ్లు కాంటా పెట్టలేదు. నేను ఏడెకరాల్లో వరి వేసిన. ప్రతిసారి 200క్వింటాళ్ల వడ్లు అమ్ముత. 42కిలోల సంచికి మూడు కిలోల కటింగ్ అంటే.. 200 క్వింటాళ్ల వడ్లకు 15 క్వింటాళ్లు కటింగ్ అయితది. అంటే 15 క్వింటాళ్లకు మద్దతు ధర (2,389) కలుపుకొంటే 35వేలపైన కటింగ్ చేస్తారన్నమాట! ఇదెక్కడి న్యాయం? ఒక్క మిల్లరోళ్లకు 35వేలు పోతే మిగతా వాళ్లకు ఏం ఇయ్యాలె. ప్రభుత్వం రైతులను ఇబ్బందిపెట్టొద్దు.
– మోతె మల్లారెడ్డి, రైతు అప్పారావుపేట (కాంగ్రెస్ నాయకుడు)