చిగురుమామిడి/ మానకొండూర్ రూరల్/ సిరిసిల్ల రూరల్, ఆగస్టు 13 : వర్షాలు పడుతున్న వేళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా కోసం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు.. ఒక్కోసారి రాత్రి వరకూ నిరీక్షిస్తున్నారు. బుధవారం ఎక్కడ చూసినా పడిగాపులు గాశారు. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని నేరేళ్ల సింగిల్ విండో గోదాం వద్ద మంగళవారం రాత్రి నుంచే క్యూలో ఉన్నారు. ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్‌లు పెట్టి, నంబర్లు రాయించుకున్నారు. కొందరు తెల్లవారుదాక అక్కడే పడిగాపులు గాశారు. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోలీస్ పహారాలో యూరియాను పంపిణీ చేశారు. ఒక్కరోజు ముందు నుంచే క్యూలైన్లో ఉన్నా యూరియా అందకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాత్రి నుంచి క్యూలైన్ ఉన్న రైతులను పక్కకు పెట్టి, కొందరు కాంగ్రెస్ నేతల పలుకుబడితో బస్తాలను అధికంగా తీసుకెళ్లారని ఆరోపించారు. సిరిసిల్లలోని పెద్దూరు సింగిల్ విండో కార్యాలయం ఎదుట ఉదయం నుంచే క్యూలైన్లో ఉన్నారు. యూరియా కోసం సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేశవపెరుమాళ్ల స్వామి ఆలయం సమీపంలోని ఐకేపీ గోదాం వద్దకు నారాయణపూర్, ఎల్లారెడ్డిపేటకు చెందిన రైతులు చేరుకున్నారు. అయితే 220 బ్యాగులు మాత్రమే వచ్చాయని తెలియడంతో అసహనం వ్యక్తం చేశారు.
అలాగే ఎల్లారెడ్డిపేటలో గ్రోమోర్ కేంద్రానికి 440 బ్యాగులు రాగా, 500కుపైగా రైతులు తెల్లవారుజామున 4.30 గంటల నుంచే బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 200 మందికే పంపిణీ చేసి, యూరియా అయిపోయిందని చెప్పడంతో మిగిలిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు సైతం ఉదయం 6 గంటల నుంచే చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు సుమారు 500 మంది టోకెన్లు రాయించుకొని క్యూలైన్లో నిల్చుంటే, మధ్యాహ్నం వరకు 200 మందికి పంపిణీ చేసి అయిపోయిందని చెప్పారు.
కోనరావుపేటతోపాటు సుద్దాల రైతు వేదిక వద్ద ఉదయం ఐదు గంటల నుంచే క్యూలైన్లో ఉన్నారు. గంటల తరబడి వేచి ఉన్నారు. అయిన కూడా సరిపడా దొరకకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు యూరియా కొరత లేదని చెబుతున్నారని, మరి కావాల్సినన్ని బస్తాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇల్లంతకుంత మండలం కందికట్కూర్ పీఏసీఎస్ సబ్ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
రుద్రంగి మండలం మానాల సొసైటీకి 230 బ్యాగులు రాగా, రైతులు ఎగబడ్డారు. ఎన్ని ఎకరాలున్నా ఒకే బస్తా ఇవ్వడంతో రైతులు అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నారు. దీంతో పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు. గంభీరావుపేట మండలంలోని లింగన్నపేటలో శ్రీ మణికంఠ మహిళా గ్రామైఖ్య సంఘానికి 350 బస్తాలు రాగా, పోలీస్ పహారా మధ్యన పంపిణీ చేశారు. సాయంత్రం వరకు స్టాక్ అయిపోవడంతో లైన్లో ఉన్న చాలా మంది రైతులు నిరాశగా వెనుదిరిగారు.
కరీంనగర్ జిల్లాలోనూ రైతులు ఇబ్బంది పడ్డారు. మానకొండూర్‌లోని గ్రోమోర్ ఎరువుల కేంద్రానికి దాదాపు 440 బస్తాలు రాగా, వానలోనూ బారులు తీరారు. రైతులకు ఒకటి, రెండు చొప్పున పంపిణీ చేసి అయిపోయిందని చెప్పారు. దీంతో యూరియా అందని మద్దికుంట, కొండపల్కల, రంగపేట, వెల్ది, ఊటూర్, వేగురుపల్లి, లక్ష్మీపూర్, గంగిపల్లి గ్రామాల రైతులు ఆందోళన చేశారు.
చిగురుమామిడి మండలం రేకొండ సొసైటీ వద్ద ఉదయం 5గంటల నుంచే బారులు తీరారు. పది గంటల వరకే స్టాక్ పూర్తి కాగా, మొత్తం 230 బస్తాలు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి పీఏసీఎస్‌కు 400 బ్యాగుల యూరియా రాగా, రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పీఏసీఎస్ ఎదుట కూడా బారులు తీరారు.