చిగురుమామిడి, ఫిబ్రవరి 5 : గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా ఎల్21 మైనర్ కెనాల్ ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, తక్షణమే రద్దు చేయాలని చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ భూ బాధితులు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఎల్21 మైనర్ కాలువ ద్వారా ప్రయోజనం లేదని 32 మంది రైతులతో కూడిన సంతకాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. గ్రామ సభలో అధికారులు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సైతం అధికారులకు వినతిపత్రం అందజేశామన్నారు. న్యాయం చేస్తామని చెప్పిన అధికారులు నోటీసులు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా డి 4 కాలువ రైతుల భూముల నుంచి పోతుందని, అదనంగా ఎల్21 మైనర్ కెనాల్ రైతుల భూముల నుంచి నిర్మాణ పనులు చేపట్టడం పట్ల రైతులు సుమారు రెండు ఎకరాల వరకు భూములు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రయోజనం లేని ఎల్21 మైనర్ కాలువను రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. నిరాహార దీక్షలో రైతులు జీల సంపత్, మంతెన మహేందర్, జైరిపోతుల సిద్ధార్థ, వంతడుపుల తిరుపతి, రవీందర్, భాగ్యలక్ష్మి, రాజవ్వ తదితరులు ఉన్నారు.