Urea | ధర్మారం, ఆగస్టు 30: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో యూరియా తిప్పలు రైతులకు తప్పడం లేదు. రోజుల తరబడి ధర్మారం మండల కేంద్రంలోని సింగిల్ విండో గోదాం వద్ద రైతులు వేచి ఉన్నప్పటికీ సరిపడా యూరియా దొరకక రైతులు తల్లడిల్లుతున్నారు. మహిళలు సైతం గోదాం వద్ద రైతులతో కలిసి యూరియా కోసం వేచి చూడడం గమనార్హం. వివరాల్లోకి వెలితే.. ధర్మారం మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉండగా నంది మేడారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) పరిధిలో 24 గ్రామపంచాయతీలు ఉన్నాయి.
ఈ మొత్తం గ్రామాలకు ధర్మారం మండల కేంద్రంలో సింగిల్ విండో గోదాం ఉంది. దీంతో వాన కాలంలో సాగు చేసిన వరి పొలాలకు మొదటి, రెండవ దఫా యూరియా రైతులు ప్రతిరోజూ ఈ గోదాం వద్దకు వచ్చి క్యూలైన్లో నిలబడుతున్నారు. కానీ రైతులకు సరిపడా యూరియా దొరకకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈనెల 28 యూరియా గోదాంకు రాక పోవడంతో రైతులు అక్కడే రోజంతా ఉన్నారు. అనంతరం ఈనెల 29 ( శుక్రవారం) లారీ లోడులో 340 యూరియా బస్తాలు రాగా 500 కు పైబడి రైతులు వచ్చారు.
రైతులు పెద్ద సంఖ్యలో యూరియా కోసం నిలబడగా వాటిని 170 మంది రైతులకు పంపిణీ చేయగా మిగతా రైతులు వెళ్లిపోయారు. తాజాగా శనివారం మిగిలిన రైతులతో పాటు కొత్తగా పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు యూరియా కోసం ఉదయాన్నే వచ్చి గోదాం వద్ద పడికాపులు కాశారు. ఈ గోదాంకు కేవలం 270 బస్తాలు మాత్రమే రాగా 148 మంది రైతులకు వాటిని పోలీసు బందోబస్తు మధ్య విండో సిబ్బంది పంపిణీ చేశారు.
దీంతో రైతులందరికీ యూరియా బస్తాలు అందకపోవడంతో వారు ఉదయం నుంచి సాయంత్రం వరదాకా తమ పేర్లు పిలుస్తారని వేచి చూసి తీవ్ర నిరాశతో వారు ఇండ్లకు వెళ్లిపోయారు. యూరియా కోసం వచ్చి ఈనెల 29న మిగిలిన ఆధార్, భూమి పట్టాదార్ పాస్ బుక్కులు కార్డు జిరాక్స్ ప్రతులు అందజేసిన 195 రైతులకు, అదేవిధంగా శనివారం 383 మంది రైతులు మొత్తం 578 మంది రైతులకు యూరియా అందకుండా పోయింది.
ఈ క్రమంలో సింగిల్ విండో సిబ్బంది రెండు రోజుల నుంచి యూరియా కోసం వచ్చిన రైతుల వారిగా వారి ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులపై నెంబర్లు వేసి చదివి వినిపించారు. మళ్లీ గోదాముకు సుమారు 450 యూరియా బస్తాలు వస్తాయని వాటిని సోమవారం పంపిణీ చేస్తామని విండో సిబ్బంది చెప్పడంతో రైతులంతా ఇక చేసేదేమీ లేక నిట్టూర్పుతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సకాలంలో వరి పొలాలకు యూరియా వేయకుంటే సరి అయిన దిగుబడి రాదని దీంతో తాము పెట్టిన పెట్టుబడులు నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ బాధలు ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 578 మంది రైతులకు యూరియా సుమారు 1,200 బస్తాలు అవసరం ఉంటుంది. ఈ లెక్కన అంత సంఖ్యలో యూరియా వస్తే కొరత తగ్గి రైతులకు ఉపశమనం కలుగుతుంది. కావున డిమాండ్ అనుసరించి సరిపడా యూరియాను అధికారులు తెప్పించాలని రైతులు కోరుతున్నారు.
యూరియా దొరకడం లేదు.. : కనకట్ల స్వప్న, మహిళా రైతు, ఖిలావనపర్తి
రెండు రోజుల నుంచి ధర్మారంలోని సింగిల్ విండో గోదాం వద్దకు వచ్చి యూరియా కోసం ఎదురు చూస్తున్నాం. రోజంతా గోదాం వద్దనే ఉంటున్నాం. కానీ మాకు యూరియా ఒక బస్తా దొరకడం లేదు. కౌలుకు తీసుకొని వరి పొలం సాగు చేస్తున్నాం. యూరియా దొరకకపోవడంతో ఏమి చేయాలో తెలియదా ఆందోళనకు గురవుతున్నాం.
మూడు రోజుల నుండి తిరుగుతున్న.. : చెప్పరి గంగవ్వ, మహిళా రైతు (ఖిలావనపర్తి)
నా పేరు చొప్పరి గంగవ్వ. మాది ఖిలావనపర్తి గ్రామం. మేము రెండు ఎకరాలలో వరి పొలం వేసినం. ఇప్పటికి దానికి యూరియా వేయలేదు. ధర్మారం మండల కేంద్రంలోని సింగిల్ విండో గోదాంకు గత మూడు రోజుల నుంచి వచ్చి పోతున్న కాని యూరియా మాత్రం దొరకడం లేదు.
మా గోస ఎవరు పట్టించుకోవడం లేదు.. : గొట్టే శంకరమ్మ, మహిళా రైతు (దొంగతుర్తి)
నా పేరు కొట్టే శంకరమ్మ మాది దొంగతుర్తి గ్రామం. మాకు 2ఎకరాల భూమి ఉండగా దానికి తోడు మరో 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి పొలం ఈ వాన కాలంలో సాగు చేసినం. ఇప్పుడు అట్టి పొలానికి యూరియా వేద్దామని అనుకొని ధర్మారంలోని సింగిల్ విండో గోదాంకు వస్తే యూరియా లేదని అంటున్నారు. రెండు రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్న యూరియా దొరకడం లేదు. రోజు కూలి పనులు పోగొట్టుకొని ఇక్కడకు వస్తున్న యూరియా దొరకక నిరాశపడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియాను తెప్పించి రైతులకు న్యాయం చేయాలి.