జగిత్యాల, జూలై 8 : కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటే, రేవంత్ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో కనీసం రైతుల గోసను పట్టించుకునే వారు లేరని ఆవేదన చెందారు. కాంగ్రెస్ అంటేనే కరువు అనే మాటను నిజం చేస్తూ, ఆఖరికి ఎరువుల కరువుకు కూడా కేరాఫ్‌గా నిలిచిందని ఎద్దేవా చేశారు.
యూరియా కొరత తీర్చాలని, పెంచిన యూరియా ధర తగ్గించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం అదనపు కలెక్టర్‌కు ఆమె వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడారు. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతుకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాడని, రైతుల కన్నీరు తుడిచాడని కొనియాడారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, రుణమాఫీ పూర్తి చేయకుండా, భరోసా రెండు పంటలకు ఎగగొట్టి, సకాలంలో యూరియా అందించకుండా రైతులను అరిగోస పెడుతున్నదని ఆగ్రహించారు. బీడు భూములను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపు కుంటున్నదని ఆగ్రహించారు. రైతును కంటతడి పెట్టించిన ప్రభుత్వం మనుగడ సాధించలేదని చెప్పారు. ఇప్పటికైనా రైతులను ఇబ్బంది పెట్టవద్దని, ఎరువుల ధరలు తగ్గించాలని, యూరియా కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ మండలాధ్యక్షులు ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, ఏలేటి అనిల్, బరం మల్లేశ్, తేలు రాజు, మాజీ సర్పంచులు బుర్ర ప్రవీణ్, నడేం శంకర్, గంగాధర్, సీనియర్ నాయకులు సాగి సత్యం రావు, శీలం ప్రవీణ్, శ్రీధర్ రెడ్డి, గంగారెడ్డి, ప్రశాంత్ రావు, ముత్తయ్య, హరీశ్, సన్నిత్ రావు, తదితరులు పాల్గొన్నారు.