తిమ్మాపూర్, జూన్23: వర్షాకాలం ప్రారంభం అయింది. రైతులు సాగు మొదలుపెడుతున్నారు. అయితే కొన్ని చోట్ల విద్యుత్ తీగలు చేతితో అందుకుంటే తాకేంత కిందికి జోల పడిపోయాయి. ప్రస్తుతం సాగుకాలం కావడంతో ట్రాక్టర్లతో దున్నుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిమ్మాపూర్ (Thimmapur) మండలం రామకృష్ణ కాలనీలోని సుభాష్ నగర్ శివారులో అంగారిక టౌన్షిప్ సమీపంలో రైతుల పొలాల్లో నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు చేతికందే స్థాయిలో వేలాడుతున్నాయి.
విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న మరమ్మతులు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వీచిన గాలులకు మరింత కిందికి జారుతున్నాయని, అధికారులు స్పందించి వైర్లను కిందికి వేలాడకుండా చేయాలని.. మధ్య మధ్యలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, ఏమైనా ప్రమాదం జరగక ముందే చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.