ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 23 : ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయని రైతులు ఆవేదన చెందుతుండగా.. తూకం వేసిన ధాన్యాన్ని తరలించడంలోనూ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. లారీలు రాకపోవడంతో బస్తాలు కేంద్రాల్లోనే మూలుగుతున్నాయి. కేంద్రాల నుంచి గోదాములకు వెళ్తున్నాయా.. లేదా..? అని అడిగే నాథుడే లేకుండా పోయాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజుల క్రితం తూకం వేసిన ధాన్యం లారీ రాకపోవడంతో కేంద్రంలోనే ఉంటున్నదని రైతులు చెబుతున్నారు. వర్షం వచ్చి ధాన్యం తడిసిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడుతున్నారు.
లారీలు ఎప్పుడత్తయో ఏమో..
ఏడెకరాల్ల్లో వరి పంటేసిన. వడ్లన్నీ ఈడికే తెచ్చిన. ఇంకా జోకలేదు. ఏంజెయ్యాలె . ఏమన్నంటే లారీలత్తలెవ్వు అంటున్నరు. ఈడికి నాలుగు రోజులైంది. లారీలు ఎప్పుడత్తయో ఏమో. సర్దాపూర్ గోదాములన్నీ కూడా నిండినయంటున్నరు. బొప్పాపూర్ గోదాముకు వడ్లు తీసుకపోతున్నరట. ఏమన్నజెయ్యనిగానీ వడ్లయితే కల్లంలకెళ్లిపోతె మంచిగుంటది గద. ఎప్పుడు వానత్తదో తెలుత్తలేదు.
– నాగుల శ్రీనివాస్, రైతు (వెంకటాపూర్)
నాలుగు రోజుల నుంచి వస్తలేవ్
పది రోజుల కింద వడ్లు తెచ్చి కొనుగోలు కేంద్రంల పోస్తే ఎప్పటికప్పుడు జోకి తీసుకోకపోవడంతో ఇబ్బందులైతున్నయ్. మొన్న వానస్తే ఎండబోసిన వడ్లన్నీ కుప్ప జేసిన. అయినా నానిపోయినయ్. వాటిని మళ్లీ ఎండబోసుడైంది. నాకు సొంతంగా 7 ఎకరాలుంటే ఇంకో మూడెకరాలు కౌలుకు తీస్కొని చేసిన. వడ్లన్నీ కల్లంలనే ఉన్నయ్. నాలుగు రోజుల నుంచి లారీలు రాక ఇబ్బందులైతున్నయ్.