రైతు భరోసాపై రైతులకు నమ్మకం సన్నగిల్లింది. సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చివరలో.. అది కూడా విడుతల వారీగా ఇస్తామని చెబుతుండడంతో పథకం ఉద్దేశం నీరుగారుతోంది. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన యాసంగి సీజన్‌కు ఇప్పుడు ఇస్తామని చెబుతుండగా, పూర్తిస్థాయిలో ఇస్తుందన్న నమ్మకం వారిలో కుదరడం లేదు. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో తొలి విడుతగా ప్రతి రైతుకు ఎకరం భూమికి రైతు భరోసా విడుదల చేస్తుండగా, ఈ విధానంపై రైతాంగం సర్వత్రా పెదవి విరుస్తోంది. మొత్తం భూమికి ఒకేసారి ఇస్తే పెట్టుబడి కోసం చేసిన అప్పులు కొంత వరకైనా తీరుతాయని, ఆ మేరకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది.
కరీంనగర్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : గతంలో పెట్టుబడికి అప్పులు దొరకక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్ట లేక, అప్పు తీర్చలేక ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం రైతాంగానికి ఆపద్బాంధవుడిగా నిలిచింది. 2018లో ప్రా రంభమైన ఈ పథకం ద్వారా రైతులకు పె ట్టుబడి సహాయా న్ని అందించడంతో వడ్డీ వ్యాపారుల దోపిడీకి తెర పడింది. మొదట ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు రూ.8 వేలు ఇవ్వగా, ఆ తర్వాత రూ.5 వేలకు పెంచి ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తూ విజయవంతంగా అమలు చేస్తూ వచ్చారు.
సామాజిక కోణం ఉన్న ఈ పథకం రాష్ట్ర రైతాంగానికి ఎంతగానో తోడ్పాటును అందించింది. వానకాలం సీజన్లో అయితే ఏప్రిల్, మే నెలల్లో, యాసంగి సీజన్‌కు అక్టోబర్, నవంబర్ నెలలోనే రైతుల ఖాతాలో జమయ్యే ది. సీజన్ ప్రారంభానికి ముందే రైతు బంధు ఇవ్వడం వల్ల రైతులు సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే వారు. వ్యవసాయ పనులకు ఉపయోగించుకునే వారు. ఈ పథకం ద్వారా 2018 నుంచి బీఆర్ఎస్ అధికారం కోల్పోయే వరకు అంటే 2023 డిసెంబర్ వరకు 11 సీజన్లలో రూ.1,735.26 కోట్లు ఒక్క కరీంనగర్ జిల్లా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది.
నీరుగారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఇంత బృహత్తర పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నీరుగారుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. తన ఎన్నికల ప్రచారంలో రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చి ఎకరానికి రూ.7,500 చొప్పున ఏడాదికి రెండు సీజన్లకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. సాగుకు యోగ్యమైన భూములకే ఇస్తామని చెప్పింది. ఆ విధంగా తాత్సారం చేసి రెండు సీజన్ల కు ఎగవేసింది. చివరికి సాగుకు యోగ్యమైన భూముల జాబితా తీసి ఎకరానికి కేవలం రూ.6 వేలు మాత్రమే ఇస్తామని మళ్లీ మాట మార్చింది. అయినా, ఆ మాత్రమైనా ఇస్తారేమోనని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వ్యవసాయ సీజన్లు వచ్చాయి. వీటిలో రెండు విడుతలు జమ చేయ లేదు.
ఇక మిగిలిన మూడు విడతలైనా సరిగ్గా ఇచ్చారా? అంటే అదీ లేదు. సీజన్ ప్రారంభంలో ఇస్తే రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతరాత్ర వ్యవసాయ పనులకు ఉపయోగించుకునే వారు. కానీ, ఇచ్చిన మూడు సీజన్లలో ఎన్నడూ ప్రారంభంలో ఇవ్వ లేదు. గత వానకాలం సీజన్‌కు మాత్రం జూన్‌లో ఇచ్చిన ప్రభుత్వం కేవలం మూడెకరాలున్న రైతుల వరకు ఇచ్చింది. ఇక మిగిలిన రైతులకు మొండి చేయి చూపింది. అంతకు ముందు యాసంగిలోనూ ఇదే పరిస్థితి. చిన్న చిన్న క్లరికల్ సమస్యలు చూపి వేలాది మంది రైతులకు ఎగవేసింది. గత యాసంగిలో 2,09,450 మంది అర్హులుగా గుర్తించి రూ.213.95 కోట్లు విడుదల చేసింది. కానీ, 1,95,945 మంది రైతులకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది. ఈ సీజన్లో 13,505 మంది రైతులకు అందలేదు. వీరి వివరాలు తమ వద్ద లేవని అధికారులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.
సీజన్ పూర్తవుతున్న దశలో యాసంగికి..
ఇక ఈ యాసంగికి సంబంధించి ఇప్పటి వరకు వాయిదాలు వేస్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా విడుదలకు సంబంధించి కొత్త విధానాన్ని ఎత్తుకుంది. ప్రతి రైతుకూ సిద్ధమైంది. అయితే, 22న రైతులందరికీ ఒక ఎకరానికి విడుదల చేసి మరో 20 రోజులకు రెండో విడుత కింద రెండో ఎకరానికి ఇస్తామని, ఏప్రిల్ చివరలో మిగతా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు. అయితే, అసలే ప్రభుత్వంపై న మ్మ కం కుదరని రైతులు ఈ కొత్త విధానంపై మరింత పెదవి విరుస్తున్నారు. సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం క్రాప్ బుకింగ్ ఆధారంగా విడుదల చేస్తూ వచ్చింది.
ఈసారి క్రాప్ బుకింగ్ ఇప్పటి వరకు 40 శాతం దాటని కారణంగా గత వానకాలం సీజన్లో ఇచ్చిన రైతులందరికీ ఇస్తామని చెప్పింది. అయితే, గత వానకాలంలో 2,10,904 మందికి రైతు భరోసా వచ్చింది. కొత్తగా నమోదైన రైతులు మొత్తంగా చూస్తే 2,14,311 మందికి ఈ సీజన్లో అందే అవకాశం ఉంది. ఈ మొత్తం రైతులకు ఒక ఎకరానికి ఆదివారం రైతు భరోసా జమవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రతి రైతుకు ఒక ఎకరం వరకు ఇచ్చి 20 రోజుల తర్వాత రెండో ఎకరానికి జమ చేస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగడం లేదు. మూడో విడుత కూడా ఇస్తారా లేదా? అనే భరోసా మాత్రం రైతుల్లో కనిపించడం లేదు. ఎప్పటిలాగే లోపాలు చూపి వేలాది మంది రైతులకు ఎగవేసే ప్రయత్నంలో ప్రభుత్వం కనిపిస్తున్నదని రైతులు అంటున్నారు. గత యాసంగిలో 13,505 మందికి, వాన కాలం సీజన్లో 20,708 మందికి క్లరికల్ లోపాల కారణంగా రైతు భరోసా ఎగవేసిన ప్రభుత్వం ఈసారి అవే కారణాలు చూపి ఎంత మందికి ఎగవేస్తుందోనన్న చర్చ జరుగుతోంది.