Farmers | పెద్దపల్లి, జూన్6: వాన కాలం సీజన్ ప్రారంభమైంది. ప్రభుత్వం ముందస్తు పంటలు వేయాలని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కానీ పెట్టుబడి సాయం మరిచినట్లుంది. నిరుడు వానకాలంలో రెతు భరోసా ఇవ్వలేదు. యాసంగిలో మొక్కబడిగా కొంత మందికే వేశారు. మిగిలిన రైతులు భరోసా ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేస్తులేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రైతును రాజు చేయటమే లక్ష్యమని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. పెట్టుబడి సాయం అందక అప్పుల పాలవుతున్న అన్నదాతల అవేదనను ఆలకించండి. రైతు భరోసా సకాలంలో అందించి రైతు సంక్షేమానికి అండగా నిలువాలని అన్నదాతలు కోరుతున్నారు.
పెట్టబడి సాయం ఎదురు చూపులు..
పెద్దపల్లి జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి 1, 50, 763 మందికి రైతులకు రైతు భరోసా పథకం కింద రూ. 154, 65, 64, 993 అందించాలి. కానీ ఇప్పటి వరకు రూ. 87, 55, 69, 849లను 1, 21, 698 మంది రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఇంకా 29, 065 మంది రైతులకు రూ. 67, 09, 95, 144 అందించాల్సి ఉంది. సాగు చేసిన ప్రతి ఎకరానికి రైతు భరోసా కింద ఎకరానికి రూ.6వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కేవలం మూడు ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందింది. మిగిలిన రైతులు పెట్టుబడి సాయం ఎదురు చూస్తున్నారు.
అటుకెక్కిన రైతుభరోసా పథకం..
ఎకరానికి (రెండు పంటలకు కలిపి) రూ. 15వేలు ఇస్తామని రెవంత్‌రెడ్డి సర్కారు నమ్మబలికింది. కమిటీల పేరిట కాలయాపన చేసింది. ఎట్టకేలకు సాగు చేసిన భూములకు మాత్రమే ఎకరానికి రూ. 6వేల చోప్పున ఏడాదికి రూ. 12వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2024 -25 వానకాలం సీజన్‌కు ఎగనామం పెట్టి.. యాసంగి సీజన్ నుంచి ఇస్తామని సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించారు.
కానీ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. కేవలం మూడు ఎకరాల లోపు మాత్రమే ఎకరానికి రూ. 6వేలు వేసింది. కేవలం కొద్ది మంది రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేసి మిగిలిన రైతులకు మొండి చేయ్యి చూపింది. 2025 మార్చి 31లోపు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం రైతు భరోసా మీద ఊసే ఎత్తటం లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. సకాలంలో పెట్టుబడి సాయం అందకపోవటంతో ఇక రైతు భరోసా పథకం అటుకెక్కినట్లేనని జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.