Farmers’ | హుజూరాబాద్, మార్చి 14: రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు డిమాండ్ చేశారు. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధనకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఉమ్మడి జిల్లా నాయకుడు ముచ్చా సమ్మిరెడ్డి శనివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైనా రామరావు మాట్లాడుతూ అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదని, అన్నదాతలను ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం తప్ప వాళ్లను అదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ధ్వజమెత్తారు. రైతు భరోసా నిధుల కోసం సమీకరించిన రూ.9వేల కోట్లలో రూ.4వేల కోట్లను కమిషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారని విమర్శించారు. మరో 15 రోజుల్లో అట్టి పంటలు కోతకు వస్తాయని, అసెంబ్లీ సమావేశాల ప్రారంభమయ్యేలోగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీనీ ముట్టడిస్తామని పోలాడి రామారావు హెచ్చరించారు. వాటర్ మేనేజ్ మెంట్ అవగాహన తాగు, సాగునీటి ఇబ్బందులున్నాయన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం అమలు జరుగుతున్న గిట్టు బాటు ధరలతో అన్నదాతలకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేవని, రైతులు: పండించిన పంటలకు రైతులే గిట్టు బాటు ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించడానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకు రావాలన్నారు. రైతు భీమా వయోపరిమితిని 70ఏళ్లకు పెంచాలని, 50ఏళ్లు నిండిన రైతులకు నెలకు కనీసం రూ.6వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు.
రైతుల అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు 20 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, ఆర్థికంగా వెనుకబడిన ఆగ్రకుల పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మర్రి వెంకటస్వామి, గూడూరి స్వామిరెడ్డి, చందు పట్ల నరసింహారెడ్డి, గోపు జైపాల్ రెడ్డి, పెండ్యాల కేశవరెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, సందీ తిరుపతి రెడ్డి, కంకనాల సరోజన, అయిత నాగరాజు, ఏనుగు చొక్కారెడ్డి, రెడ్డి సంపత్ రెడ్డి, కుమారస్వామి, పలుమండలాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.