కొద్ది రోజుల్లోనే యూరియా కొరత తీవ్రం కానున్నదా..? ఎరువుల వాడకం ఎక్కువగా ఉండే వచ్చే నెలలో మరింత ఇబ్బంది ఏర్పడనున్నదా.. అంటే అవుననే స్పష్టమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో యూరియాకు ఆగస్టులో కొరత ఏర్పడే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తున్నది. వచ్చే నెలలో 15,139 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేయగా, ఇప్పటి వరకు 6,650 మెట్రిక్ టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి.
ఈ నెలకు కొంత వాడుకున్నా వచ్చే నెలలో మాత్రం తీవ్రమైన కొరత ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎకరాకు రెండు బస్తాలు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఎకరాకు ఒక్క బస్తానే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. వచ్చే నెలలో సీజన్ మొత్తంలోనే అత్యధికంగా యూరియా అవసరం ఉంటుందని, కానీ డిమాండ్‌కు తగినట్టు దొరుకుతుందనే నమ్మకం లేదని చెబుతున్నారు. ఇప్పటికే డీఏపీకి బదులు 20:20 ఎరువులను అంటగడుతున్నారని వాపోతున్నారు.
కరీంనగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు యూరియా కొరత ఏర్పడలేదు. వచ్చే నెలలో కొరత ఏర్పడక తప్పని పరిస్థితి కనిపిస్తున్నది. పంటల సస్యరక్షణలో పై పాటుగా వాడుకునే యూరియా ఈ వానకాలం సీజన్లో 43,254 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని యంత్రాంగం అంచనా వేసింది. సీజన్ ప్రారంభంలో 21,802 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నది. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఇప్పటి వరకు 2 వేల మెట్రిక్ టన్నులకుపైగా జిల్లాకు కేటాయించిన యూరియా నిల్వలు వచ్చినట్టు తెలుస్తున్నది.
ఈ నెలలో 12 వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియా వినియోగించినట్టు తెలుస్తుండగా, ఈ నెల 25 వరకు హోల్‌సెల్లర్స్ వద్ద 330.043 మెట్రిక్ టన్నులు, రిటైల్ వ్యాపారుల వద్ద 1,952.261, సొసైటీల వద్ద 1,711.218, మార్క్‌ఫెడ్‌లో 2,656.880 చొప్పున 6,650.402 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. ఈ నెలలో మరో 900 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశమున్నది. ఈ మొత్తాన్ని కలుపుకొంటే 7,550 మెట్రిక్ టన్నుల వరకు యూరియా అందుబాటులో ఉంటుంది. ఈ నెలలో రైతులు మరో 2 వేల మెట్రిక్ టన్నులకుపైగా వినియోగించుకునే అవకాశం ఉండవచ్చు. ఇక 5 వేల మెట్రిక్ టన్నులకుపైగా మిగిలే అవకాశం ఉంటుంది.
కీలకం కానున్న ఆగస్టు
ఎరువులు ముఖ్యంగా యూరియా వాడకం ఎక్కువగా ఆగస్టులోనే ఉంటుంది. పత్తి, వరి, మక్క తదితర పంటలు కీలక దశకు చేరుకుంటాయి. ఈ దశలోనే యూరియా ఎక్కువగా వాడతారు. ఈ ఒక్క నెలలోనే అన్ని పంటలకు కలిపి 15,139 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ, దానికి తగినట్టుగా జిల్లాల్లో యూరియా నిల్వలు లేవు. కరీంనగర్ జిల్లాలో ఈ నెల 25 వరకు ఉన్న బ్యాలెన్స్ చూస్తే 6,650.402 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నది. అన్ని రకాల వ్యాపారుల వద్ద తక్కువ నిలువలే కనిపిస్తున్నాయి.
అధికారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారంగానైనా జిల్లాకు యూరియా కేటాయిపులు జరుగుతాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే అవసరానికి తగినట్టు నిల్వలు జిల్లాలో లేవు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. తగ్గుముఖం పట్టిన వెంటనే రైతులు ఎక్కువగా వరి నాట్లు వేసే అవకాశముంటుంది. ఆ తర్వాత యూరియా వాడకం పెరుగుతుంది.
ఇది వరకు ఎకరానికి 3-4 బస్తాల యూరియా వాడిన రైతులు, ఇప్పుడు అధికారులు అవగాహన కల్పించిన తర్వాత 2 బస్తాలు వాడేందుకు ముందుకు వస్తున్నారు. చాలా మంది రైతులు ఎకరానికి 3 బస్తాలు వాడాలని చూస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీల ద్వారా ఎకరానికి ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. పాసు పుస్తకం పరిశీలించిన తర్వాతనే యూరియా ఇస్తుండగా, రైతుల ఇక్కట్లు ఈ నెలలోనే మొదలైనట్లు స్పష్టంగా తెలుస్తున్నది.
కృత్రిమ కొరత?
అధికారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ప్రభుత్వం ఎరువులు సరఫరా చేయకుంటే వచ్చే నెలలో తప్పని సరిగా ఎరువుల కొరత ఏర్పడే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే డీఏపీకి కొరత ఏర్పడి 20:20 ఎరువును అంటగడుతున్నారు. వరి నాటుకు ముందు దుక్కిలో ఎకరాకు ఒక బస్తా డీఏపీ వాడితేనే సారం ఉంటుంది. కానీ, దీనికి బదులు అనేక సొసైటీల్లో 20:20 ఇస్తున్నారు. డీఏపీ లేదని చెబుతుండడంతో విధి లేక రైతులు ఈ ఎరువులనే వాడుతున్నారు.
వర్షాలు తగ్గి వరినాట్లు ముమ్మరమైతే ఈ ఎరువులకు కూడా కొరత ఏర్పడే అవకాశమున్నది. ఒక్క యూరియా, డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకే వంటి మందులేవీ సరిపోను నిల్వలు ఉన్నట్టు కనిపించడం లేదు. కానీ, ప్రభుత్వం మాత్రం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నది. ప్రధానంగా యూరియా మునుపటిలా లభించే అవకాశాలు లేనందున రైతులు ఎక్కువ తీసుకుని నిల్వ చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఎకరానికి ఒక బస్తా మాత్రమే ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది. నిజానికి యూరియాను ఎకరాకు రెండు బస్తాలు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ సొసైటీల్లో మాత్రం ఒక్కటే ఇస్తున్నారు. రైతుల ఆధార్ కార్డులు తీసుకుని, పట్టాదారుపాసు పుస్తకం పరిశీలించి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని యూరియా బస్తాలు ఇస్తున్నారు.
యూరియాను బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం జిల్లాకు రాష్ట్ర స్థాయి ఎరువుల పరిశీలకులుగా హాకా జనరల్ మేనేజర్ ఎస్వీ ప్రసాద్‌ను నియమించింది. ఈ నెల 25న ఆయన జిల్లాలో పర్యటించి పలు ఎరువుల డిపోలు, డీలర్, హోల్‌సేల్ దుకాణాలను పరిశీలించారు. కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా వ్యవసాయ అధికారి జే భాగ్యలక్ష్మి కూడా తరుచూ ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తున్నారు.
ఎకరం ఉంటేనే ఎరువులు
కౌలు, చిన్న రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎకరం ఉంటేనే ఎరువులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. 20 గుంటలు, 30 గుంటల భూమి ఉండి వ్యవసాయం చేసుకుంటున్న చిన్న రైతులకు యూరియా దొరికే పరిస్థితి కనిపిండం లేదు. ఎకరం ఉంటే తప్పా యూరియా బస్తా ఇవ్వమని అనేక సొసైటీల్లో రైతుల ముఖం మీదనే చెప్పేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. వీరు కౌలుకు తీసుకున్న భూమి యజమాని పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తే తప్పా ఎరువులు కొనుక్కోలేక పోతున్నారు. వందలాది రైతులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. తమ పంటలకు ఎరువులు వేసేది ఎలాగని వాపోతున్నారు.
యూరియా దొరక్క వెనుదిరిగిన రైతులు
శంకరపట్నం, జూలై 27: నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతుండడం, ఆదివారం తెరిపి ఇవ్వడంతో ఆదివారం మెట్పల్లి సింగిల్ విండో పరిధిలోని కన్నాపూర్ గోదాం వద్దకు రైతులు యూరియా కోసం తరలివచ్చారు. అయితే మధ్యాహ్నం వరకే స్టాక్ అయిపోయిందని విండో సిబ్బంది తెలుపడంతో పలువురు రైతులు నిరాశగా వెనుదిరిగారు. వర్షాలు పడుతున్న సమయంలో కొరత ఏంటని ప్రశ్నించారు. సరిపడా యూరియా స్టాక్‌ను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.