పెద్దపల్లి, మార్చి 24 (నమస్తే తెలంగాణ)/ గోదావరిఖని : రాష్ట్రంలో పంటలకు సాగునీరందక రైతులు అల్లాడిపోతున్నారని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువు మాత్రమేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఇటీవల ఆరు రోజుల పాటు ‘గోదావరి తల్లి కన్నీటి గోస’ పేరిట 198 కిలోమీటర్ల మహా పాదయాత్ర చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల బృందాన్ని సోమవారం గోదావరిఖనిలోని టీజీబీకేఎస్ కార్యాలయంలో ఆయన సన్మానించారు.
పాదయాత్రపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం ఫొటోను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు అందజేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, ఎడారిగా మారిన గోదావరి, నీరు లేక రైతులు పడుతున్న బాధలను తెలిపేందుకు కోరుకంటి చందర్ పాదయాత్ర విజయవంతంగా నిర్వహించారని మాజీ మంత్రి కొనియాడారు. కేసీఆర్ పాలనలో నిండు వేసవిలోనూ పుష్కలమైన జలాలతో రైతులు పంటలు పండించుకున్నారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ చేతగాని పాలనతో చుక్క నీరు రాక బీటలు వారుతున్న భూములను చూసి ఆగమైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరిలో నాడు నిండుగా పారిన జలాలు నేడు ఎటుపోయాయని ప్రశ్నించారు. కేవలం రాజకీయ కక్షతోనే కావాలనే కాళేశ్వరంపై విష ప్రచారం చేసి నీటిని దిగువకు వదిలేసి గోదావరిలో చుక్కనీరు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఎన్నో ఆశలతో సాగుచేసిన పొలాలను ఎండబెట్టి, రైతును గోసపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టారు.
గోదావరిలో నీళ్లు లేక, ఎత్తిపోతలు లేక రాష్ట్రంలో చేతికచ్చే దశంలో పంటలు ఎండిపోతున్నాయని, కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలా ఉంటే సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు మాత్రం ఎండల తీవ్రతకు పంటలు ఎండిపోతున్నాయని, నీరు పుష్కలంగా ఉందని హేళనగా మాట్లాడడం సరికాదన్నారు.
అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి అధికారం దక్కించుకున్నదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి నీటిని ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రా ష్ట్రం తాగు, సాగు తాగునీటితో సస్యశ్యామలం అయ్యే వరకు తమ పొరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు కౌశిక హరి, రాకం వేణు, బొడ్డు రవీందర్, గాధం విజయ, కల్వచర్ల కృష్ణవేణి, కవిత, సరోజిని, ఆడప శ్రీనివాస్, బొబ్బలి సతీశ్ కుమార్, సట్టు శ్రీనివాస్, బుర్ర వెంకన్న, కొడి రామకృష్ణ, రామరాజు, అవునూరి వెంకటేశ్, పద్మ, వెంకటస్వామి, ఓదెలు, రాజేశ్ నాయక్ పాల్గొన్నారు.