రుద్రంగి, మే 27: రైతాంగం అరిగోస పడుతున్నది. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యంతో కన్నీరు పెడుతున్నది. మొన్నటిదాకా సాగునీరు లేక, కరెంట్ సరిగ్గా ఉండక అరిగోస పడి, పండించిన కొద్దిపాటి ధాన్యాన్ని కేంద్రాలకు తరలిస్తే.. సకాలంలో కొనేవారు లేక ఆగమవుతున్నది. సెంటర్లకు వడ్లు తెచ్చి పదిహేను ఇరువై రోజులైనా కొనకపోవడం, రోజురోజుకు రాశులు పేరుకుపోవడం, మరోవైపు గన్నీ సంచులు, లారీల కొరతతో కొన్నది వెనువెంటనే మిల్లులకు తరలించకపోవడంతో అటు ధాన్యాన్ని, ఇటు బస్తాలను కాపుకాయలేక, అకాల వర్షానికి కాపాడుకోలేక ఆందోళన చెందుతున్నది. అక్కడక్కడ కండ్ల ముందే తడిసిపోయి మొలకెత్తుతుండడంతో ఆవేదన చెందుతున్నది.
ఇందుకు రుద్రంగి మండలమే నిదర్శనంగా నిలుస్తున్నది. మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతున్నది. తేమశాతం వచ్చినా నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం పేరుకుపోతున్నది. దీంతో రేయింబవళ్లు ధాన్యం వద్దే ఉంటూ, వర్షానికి తడువకుండా టార్పాలిన్లతో కాపుకాస్తున్నారు. రోజులు గడుస్తున్నా కొనకపోవడం, అకాల ముప్పుతో ధాన్యం తడిసిపోతుండడంతో కొందరు రైతులు తక్కువ డబ్బులకు దళారులకు విక్రయించుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఇంత గోస పెట్టవద్దని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నేను రుద్రంగి సెంటర్కు వడ్లు తెచ్చి రెండు నెలలైతంది. మాయిచ్చర్ రాలేదంటే చాలా రోజులు ఆరబెట్టిన. మాయిచ్చర్ వచ్చిన తర్వాత నిర్వాహకుల దగ్గరికిపోతే రేపు, మాపంటూ దాటేస్తున్నరు. రోజంతా ఇక్కడే ఉండి కాపుకాస్తున్నం. కానీ ఏం లాభం? మొన్నపడ్డ వానలకు ధాన్యం తడిసి మొలకలచ్చినయి. ప్రభుత్వం మా రైతుల ఇంత గోసపెట్టద్దు. మొలకెత్తిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయాలి.
– లింగంపెల్లి లక్ష్మి, రుద్రంగి
మాది రుద్రంగి. నేను చాలా ఏండ్ల సంది ఎవుసం చేస్తున్న. ఈ యేడు సాగు నీళ్లు రాక రెండు లోడ్ల ధాన్యం మాత్రమే దిగుబడి అచ్చింది. పండిన కొద్దిపాటి ధాన్యాన్ని కేంద్రానికి తెస్తే రుద్రంగిల సెంటర్కు తేస్తే నెల రోజులైనా కొనలే. సార్లు రేపు మాపంటూ దాటేస్తున్నరు. అప్పటి నుంచి ఇక్కనే వడ్ల కావలి ఉంటున్నం. మొన్న పడ్డ వానకు వడ్లు తడిసి మొలకలు అచ్చినయి. ఇసోంటి పరిస్థితి గతంలో ఎన్నడూ రాలె. మమ్ముల ఇట్ల గోస పెట్టుడు అధికారులకు న్యాయం కాదు. ఈ పాపం వాళ్లదే. తడిసిన, మొలకెత్తిన ధాన్యం మొత్తం సర్కారే కొనాలి.
– సింగారపు గంగు, రుద్రంగి