కరీంనగర్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాటి పాలనలో కుదేలైన ఎవుసాన్ని పండుగలా చేసి, రైతును వెన్నుదన్నుగా నిలిచింది రైతుబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆరేనని కర్షకులు కొనియాడుతున్నారు. పదేండ్లలోనే 24గంటల కరెంట్, సాగునీరు, రైతుబంధు ఇచ్చి ఆసరా అయ్యారని, ధరణి పోర్టల్ తెచ్చి భూములకు భద్రత కల్పించారని ప్రశంసిస్తున్నారు. నాడు అరిగోస పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ ఆగం చేయాలని చూస్తున్నదని ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ రాక ముందు దుర్భర పరిస్థితులు అనుభవించామని, ఆ నాడు వ్యవసాయరంగం పూర్తిగా ఆగమైందని నాటి రోజులను గుర్తు చేస్తున్నారు. కరెంట్ ఆరుగంటలని చెప్పినా మూడు గంటలు కూడా వచ్చేది కాదని, అది ఎప్పుడొచ్చేదో ఎప్పుడు పోయేదో కూడా తెలిసేది కాదని, అచ్చే కరెంట్ కోసం పొద్దంతా పడిగాపులు కాసేదని, రాత్రి పూట పొలాల వద్దకు ఎంతో మంది రైతులు విషకీటకాలు కుట్టో.. కరెంట్ షాక్లతోనో చనిపోయారని, ఆ రోజులు మళ్లీ రావద్దని తల్సుకున్నారు. గోదావరి జలాలు సముద్రం పాలైనా చుక్క నీటిని ఒడిసిపట్టలేదని, సాగునీటి వసతి లేక పంటలు ఎండుతున్నా.. భూములు బీళ్లుగా మారుతున్నా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. చివరకు అప్పుల్లో చిక్కుకున్నా, ఆ అప్పుల బారి నుంచి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకున్నా.. వలస బాట పట్టినా.. కుటుంబాలు రోడ్డున పడినా కనీసం సాయం అందలేదని, ఇంకా ఆ రోజులు కండ్ల ముందే ఉన్నాయని యాది చేసుకున్నారు.
నాడు భూములకు రక్షణ ఉండేది కాదని, ఎప్పుడు గొడవలే ఉండేవని, దళారులదే రాజ్యం నడిచేదని వివరిస్తున్నారు. లంచాలు ఇవ్వనిదే ఏ పని అయ్యేది కాదని, యజమానులకు తెలియకుండానే రికార్డులు తారుమారు చేసే పరిస్థితి ఉండేదని, ఏ రికార్డులు మార్చిన అసలైన వారికి తెలిసేది కాదంటున్నారు. రిజిస్ట్రేషన్ కావాలన్నా రోజులు పట్టేదని, పట్టాలు కావాలంటే ఆఫీసుల చుట్టు తిరగాల్సి వచ్చేదని, భూ తగాదాలతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే దుస్థితి ఉండేదని వాపోతున్నారు. కానీ, స్వరాష్ట్రంలో పరిస్థితులన్నీ మారాయని, అన్నదాతలకు మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో రైతుల కష్టాలను కండ్లారా చూసిన కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఎవుసం బాగుపడిందని చెబుతున్నారు. 24గంటల నాణ్యమైన కరెంట్ వస్తున్నదని, ప్రాజెక్టుల నిర్మాణంతో పుష్కలంగా జలాలు వస్తున్నాయని, పంటలు మంచిగా పండుతున్నాయని, రైతుబంధుతో పంట పెట్టుబడి కష్టాలు తీరాయని సంతోష పడుతున్నారు.
రైతు ఎలా చనిపోయినా రైతు బీమా కింద సాయం అందిస్తూ కుటుంబాలకు ఆసరా అవుతున్నారని అంటున్నారు. ఇంకా ధరణి పోర్టల్ తెచ్చి వ్యవసాయ భూములకు రక్షణ కల్పించి వివాదాలు లేకుండా చేశారని, నిమిషాల్లోనే భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని, పత్రాలు ఇంటికే వస్తున్నాయని చెబుతున్నారు. భూమి వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటున్నాయని, క్షణాల్లో తెలుసుకోవచ్చని, అలాగే యజమానికి తెలియకుండా భూమి ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల పేరుపైకి మారదని స్పష్టం చేస్తున్నారు. రైతులందరూ మంచిగున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నలభై ఏండ్ల పాలనలో తమ బాధలు ఎనాడూ పట్టించుకోలేదని, పైగా అరిగోసపెట్టిందని మండిపడుతున్నారు.
ఇప్పుడొచ్చి మూడు గంటల కరెంటే సరిపోతుందని, అది ఎలా సాధ్యమంటే 10 హెచ్‌పీ మెటర్లు పెట్టుకోవాలని, రైతు బంధు దుబారా అని, ధరణిని బంగాళా ఖాతంలో వేస్తామంటూ పూటకో మాట మాట్లాడుతూ పరేషాన్ చేస్తున్నారని ఆగ్రహించారు. వాళ్మను నమ్మితే మళ్లీ పాత రోజులే వస్తాయని, కారు చీకట్లు కమ్ముకుంటాయని, ఉచిత కరెంట్ పోతుందని అన్నదాతల బతుకులు ఆగమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరణి రద్దయితే పాత వ్యవస్థ వస్తుందని, ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో భూ సమస్యలు, కొట్లాటలు మొదలవుతాయని భయపడుతున్నారు. అందుకే కాంగ్రెస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వద్దని, కరెంట్, నీళ్లకు ఏబాధా లేకుండా చేసిన కేసీఆర్ వెంటే తాముంటామని చెబుతున్నారు. అన్నదాతలు తిన్న రేవు మరువరని, తమకు మేలు చేసిన కేసీఆర్‌కు అండగా ఉంటారని స్ప ష్టం చేస్తున్నారు.
కాంగ్రెసోళ్లను నమ్మితే.. రైతు ఆత్మహత్యలు పెరుగతయి
కాంగ్రెసోళ్లు రైతుబంధు భూ యజమానికి, కౌలు రైతుకు ఎవరికన్నా ఒకరికి ఇస్తమంటున్రు. ఇద్దరికీ ఇస్తమంటలేరు. అంటే మళ్ల భూ యజమాని, కౌలు రైతు కొట్టుక చావాల్న. కౌలురైతుకే రైతుబంధు ఇస్తమంటే భూ యజమాని ఒప్పుకోడు. గట్టిగా మాట్లాడితే భూమి కౌలుకే ఇయ్యనని, పడావు ఉంచుకుంట అంటడు. అప్పుడు కౌలు రైతులకు భూమి కౌలుకు దొరకక ఆగమైతడు. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటే అంటున్రు. ఆ కరెంట్‌తోని ఎవుసం సాగుతదా.. ఒక మడి అయిన పారుతదా. ఇట్లయితే కౌలు రైతు కౌలు కట్టలేని పరిస్థితి వస్తది. మళ్ల రైతు ఆత్మహత్యలు పెరుగుతయి. కాంగ్రెసోళ్ల మాటలు వింటే.. ఎవుసం సాగక రైతులు అడ్డ మీద కూలీలవుతరు. రైతులు సల్లగుంటే కాంగ్రెసోల్ల కండ్లు మండుతున్నట్లు ఉన్నయి. అందుకే గిసొంటి గత్తర లేపే మాటలు మాట్లాడుతున్రు. మా రైతులెవరూ కాంగ్రెస్‌ను అసలు నమ్మరు. నమ్మితే నట్టేట మునుగుడే. కేసీఆర్ సార్ వచ్చినంక 24 గంటల నాణ్యమైన కరెంట్ మంచిగా ఉంటుంది. రైతు బంధు వస్తుంది. నీల్లు వచ్చినయి. మా రైతులకు ఇంతకన్నా ఇంకా ఏం కావాలి. అందుకే మళ్ల మేం కేసీఆర్ సారుకే ఓటేస్తం. మల్ల ఆయనే సీఎం అవుతడు.
– పెండ్యాల శ్రీమతి, మహిళా రైతు,చెర్లభూత్కూర్ (కరీంనగర్ రూరల్)
తహసీల్ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తది
ధరణి పోర్టల్‌తో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. స్లాట్ బుక్ చేసిన వెంటనే తహసీల్ ఆఫీసులో భూమి రిజిస్ట్రేషన్ చేసి మ్యుటేషన్, పాసు పుస్తకం ఇస్తున్నరు. కాంగ్రెస్ నాయకులు భూమాత పోర్టల్ తీసుకువస్తే పాత పద్ధతిలో పట్వారీ, గిర్దవార్లు, తహసీల్ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తది. భూములకు భద్రత కూడా ఉండదు. ఒకరి భూమి మరొకరి పేరుపై మారుస్తరు. కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు.
-సోమిరెడ్డి మునీరెడ్డి, జూబ్లీనగర్, (కరీంనగర్ రూరల్ మండలం)
లంచం ఇస్తేనే పట్టాలు పాస్‌బుక్కులు వచ్చేవి
తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకువచ్చినప్పటి నుంచి రైతులకు ఎలాంటి కష్టాలు లేవు. అంతకుముందు పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు భూముల పట్టాలు కావాలంటే ఏండ్ల తరబడి తిరిగేవాళ్లం. పట్టాలు అయినంక పాస్‌బుక్‌లు ఇవ్వకపోయేది. లంచం ఇస్తేనే పట్టాలు పాస్ బుక్‌లు వచ్చేవి. కానీ, ధరణి వచ్చినప్పటి నుంచి ఎలాంటి కష్టాలు లేకుండా ఒక్క రోజులోనే పట్టా అవుతుంది. పాత పాస్ బుక్ ఉంటే వెంటనే పట్టాచేసుకున్న సర్వేనంబర్‌ను ఎక్కిస్తున్నరు. ప్రొసీడింగ్ కాపీ ఇస్తున్నారు. కొత్త పాస్ బుక్ కావాంటే వారం లేక పది రోజుల్లో పోస్టులోనే ఇంటికి వస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్లు పాత పట్వారీ వ్యవస్థ తీసుకువస్తామంటే ఊరుకునే ప్రసక్తేలేదు.
-కాసర్ల సుధాకర్‌రెడ్డి, కందుగుల, రైతు (హుజూరాబాద్ రూరల్)
నాటి ఇబ్బందులు గుర్తుకు వస్తే కండ్ల పొన్న నీళ్లు వస్తయ్
ధరణి వచ్చినంక మా భూములు భద్రంగా ఉన్నయ్. ఇదివరకు వీఆర్వోలు ఇష్టం వచ్చినట్లు ఒకరి భూములు ఇంకొకరి పైరు మీది మార్చేవారు. దీంతో గొడవలు జరిగేవి. పోలీసు కేసులయ్యేవి. ఎంతో మంది జైలు పాలైన రోజులు కూడా ఉన్నాయి. భూమి పట్టాల గురించి రైతులు పడ్డ ఇబ్బందులు గుర్తుకు వస్తే కండ్ల పొన్న నీళ్లు వస్తయ్. రైతులకు వరంలా ఉన్న ధరణి తీసేస్తమంటున్న కాంగ్రెసోళ్లకు తగిన గుణపాఠం తప్పదు. అలాంటిది ఇప్పుడు ధరణితో ఆ సమస్యలు తొలగిపోయినయ్. దాన్ని కాంగ్రెసోళ్లు తొలగిస్త మంటే ఊరుకుంటమా. బీఆర్ఎస్ సర్కారు రైతులకు చేసిన మేలును మరుస్తమా?.
– రావుల వెంకట్‌రెడ్డి, కందుగుల, రైతు (హుజూరాబాద్ రూరల్)
భూముల ధరలు పడిపోతయ్
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి ఓటేస్తే భూముల ధరలు పాత రోజులకు పడిపోతయ్. తెలంగాణ రాకమునుపు ఎకరం భూమికి రూ.5లక్షల కంటే తక్కువనే ఉండేది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎవుసానికి 24 గంటల కరెంటు, రైతుబంధు ఇస్తుండడంతో భూముల ధరలు బాగా పెరిగినయ్. దీంతో రైతులకు ఎంతో ధీమా వచ్చింది. మాదగ్గర ఇప్పుడు రూ.50 లక్షలకు ఎకరం పలుకుతంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగుకు పుష్కలంగా నీళ్లు రావడంతో రైతులకు దండిగా పంటలు పండుతున్నయ్. పండిన పంట కూడా ప్రభుత్వమే కొంటుండడంతో రైతులు ఆర్థికంగా ఎదుగుతున్నరు. కేసీఆర్ సారు అచ్చినంకనే రైతుల బాధలు తీరినయ్. రైతులు ప్రశాంతంగా బతుకుడు కాంగ్రెసోళ్లకు ఇష్టం లేనట్టుంది. అందుకే ధరిణి తీసేస్తమని, మూడు గంటల కరెంటు ఇస్తమని రైతులను ఆగం చేస్తున్నరు. వాళ్లను నమ్మితే బతుకులకు మళ్లా గ్యారెంటీ లేదు. రైతులకు ఎంతో మేలు చేస్తున్న కేసీఆర్‌కే మా మద్దతు.
-ఏనుగుల శ్రీనివాస్, రైతు, కొత్తపల్లి, హుజూరాబాద్ మండలం
అబద్ధాల రేవంత్‌కు బుద్ధి చెప్తం
రేవంత్‌రెడ్డి మాటలు నమ్మశక్యంగా లేవు. మల్ల మా కేసీఆర్‌నే తెచ్చుకుంటం. గతంలో కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరిగ్గా లేక పోవడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. మాటల గారడితో రైతులను పకదారి పట్టిద్దామనుకుంటున్న రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌కు రైతులం సరైన బుద్ధి చెబుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే గౌరవంగా బతుకుతున్నం. తెలంగాణ రైతులమంతా బీఆర్ఎస్ వైపే ఉన్నం. 24 గంటల కరెంటు ఉండాలంటే.. కేసీఆరే మళ్లీ అధికారంలోకి రావాలి. కాంగ్రెసోళ్లు హైకమాండ్ చెప్పింది చేస్తరు. మా కేసీఆర్‌కు ప్రజలే హైకమాండ్, కనుక మేము చెప్పింది చేసే కేసీఆర్‌కే మా మద్దతు, ఓటు కూడా.
-శ్రీపాద రాజమౌళి, రైతు, కొత్తపల్లి (హుజూరాబాద్‌టౌన్)
రాబంధులకు రాష్ర్టాన్ని అప్పగించం
తొమ్మిదేళ్లుగా వ్యవసాయం సంతోషంగా చేసుకుంటున్నం. ఎలాంటి సమస్యలు లేకుండా పండుగలా పనులు సాగుతున్నయి. తెలంగాణ ప్రభుత్వం హయాంలో ఎరువులు, కరెంటు, ధాన్యం విక్రయానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటిది ఇప్పుడు, ధరణి ఎత్తేస్తాం, మూడు గంటల కరెంటు ఇస్తాం అని వచ్చేటోళ్లకు ఎట్లా ఓటు వేస్తాం. పూర్తి స్థాయిలో కరెంటు కష్టాలు లేకుండా చూసింది కేసీఆర్ సారు. అలాంటి సారు రాష్ట్రం పచ్చగా ఉండాలనే చూస్తుండు. ఇలాంటి సమయంలో రాబంధులకు రాష్ట్రం అప్పగించి ఎలా సంతోషంగా ఉంటం. కాంగ్రెస్ అచ్చేది లేదు.. సచ్చేది లేదు.
– సల్ల కిష్టయ్య, రైతు, అల్గునూర్(తిమ్మాపూర్)
కాంగ్రెసోళ్లకు గుణపాఠం చెప్తం
ఎవుసం చేసేటోళ్లకు తెలుస్తది కరెంటు ఎంత అవసరమో. మందిమీద వడి బతికేటోనికేం తెలుస్తది ఎన్ని గంటల కరెంటుకు ఎంత పారుతదని. మూ డు గంటల కరెంటిత్తమని అంటర..? ఎట్లా అంట రు. చూస్తా, చూస్తా ఇంత మాటన్న కాంగ్రెస్‌కు ఎట్ల ఓటేత్తం. వేసేదే లేదు. గుణపాఠం చెబుతం. మూడు గంటల కరెంటుతోటి గుంట కూడా పారది. ఎండకాలంలా పొలానికి పోయే కాల్వ కూడా సాగది. ఇప్పుడిస్తున్న బీఆర్ఎస్ 24గంటలిత్తంది గదా. మీకేం మంట. ఎందుకంత మా మీద కోపం. మేం మంచిగ బతకద్ద ఏంది. రైతుల ను రాత్రుళ్లు కరెంటిచ్చి సంపుతరా ఏంది. బా యిల కాడ పండుడద్దు. మిమ్మల్ని గెలిపించుడూ వద్దు. ఇంకా ధరణిని మారుత్తరట. ఎందుకో చెప్పాలే. మళ్ల ఊర్లల్ల లొల్లులు, కొట్లాటలు కావల్నా. ధరణితో ఇప్పుడు మంచిగున్నం. ఎవని భూమి వాళ్లకు బుక్కుల్లోకెక్కింది. ధరణి మారిస్తే బ్రోకర్ల రాజ్యమైతది. ఇవన్నీ మాకెందుకు. అసలు మిమ్మల్ని గెలిపియ్యకుంటే సాలుగదా.
-పొద్దుటూరి మోహన్‌రెడ్డి, రైతు, పెద్దంపల్లి(జమ్మికుంట)
10 హెచ్పీతో ఖర్సుల పాలే
రైతులం ఎక్కువగా 3, 5 హెచ్‌పీ మోటర్లే వాడుతం.ఎక్కువ దూరం పైపులు వాడినా ఎట్లాండి బాధుండదని 5 హెచ్‌పీ మోటర్లు వాడుతం.10 హెచ్‌పీ మోటర్లు వాడితే రూ.వేల రూపాలు ఖర్సు చేసుడుతో పాటు కరెంట్ ఎక్కువ తక్కువ వస్తే రైతులకు రిపేర్ల బాదలు తప్పవు.ఇప్పుడు వాడుతున్న స్టార్టర్లు, మోటర్లు, పైపులైన్లు మార్చుకోవాల్సి ఉంట ది.వాటికి లక్షల్లో ఖర్చు అయితది.రైతులు ఖర్సుల పాలు కావల్సిందే.కమర్షియల్ కరెంట్ కనెక్షన్లు తీసుకోవాల్సి అస్తది.10 హెచ్‌పీ మోటర్లు వాడితే ఎక్కువ కరెంట్ అవసరం ఉంటది. ఇప్పుడున్న ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతయి.గతంలోనే కరెంట్ ఎక్కువ తక్కువ వస్తే పడరాని పాట్లు పడ్డం.మళ్ళా ఆ బాదలు పడాలని ఏ రైతు కోరుకుంటలేడు.ఇప్పుడున్న కరెంట్‌తోని రైతులు సంతోషంగ ఉన్నరు.రైతుల కష్టాలు తెలిసిన కేసీఆరే మళ్ళా సీఎం కావాలే.
-దాసారపు కొమురయ్య, రైతు(వీణవంక)
అచ్చిరాని కరెంట్‌తోని మోటర్లు కాలేది
కాంగ్రేస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అచ్చీరాని కరెంట్‌తోని మోటర్లు కాలేది.కరెంట్ కోసం గంటల లెక్క ఎదిరిచూసేది.ఆ కరెంట్ ఎక్కువ తక్కువ అచ్చే సరికి ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయేది.15 రోజులకోసారి ట్రాన్స్ ఫార్మర్లను హుజూరాబాద్‌కు తీసుకపోయి మనిషికిన్న పైసలు ఏసుకొని రిపేర్ చేయించేది.రిపేర్ చేసుడు లేట్ అయితే పొలాలు ఎండి నెర్రలు వారేది. కరెంట్ కావాలని ధర్నాలు చేసే ది.పోలీసులు అరెస్ట్ చేసి, కేసులు కూడ పెట్టెటోళ్ళు.బాయిల కాడ రాత్రి పూట పండుకుంటే పాము లు, తేళ్ళు పారేది.అరగోస ప డ్డం.పంటలు పండుతయో ఎండుతయో తెలువని పరిస్థితి ఉండే ది.అట్లాంటిది కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చినసంది బంగారు పం టలు పండుతన్నయి.ఇయ్యాల రైతులం సంబురంగ ఉంటన్నమంటే కేసీఆర్ 24 గంటల కరెంట్, నీళ్ళు ఫుల్‌గా ఉండడం వల్లనే.కాంగ్రేస్తోని ఏగింది చాలు..మళ్ళా కేసీఆర్ ప్రభుత్వమే రావాలే.
-చింతల రాజయ్యగౌడ్, రైతు, రెడ్డిపల్లి గ్రామం(వీణవంక)
భూములు పడావు ఉంటయ్..
సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు మంచి రోజులచ్చినయ్. రైతుబంధు, రైతుబీమా పథకాలతో భూముల ధరలు ఐదు రేట్లు పెరిగినయ్. 24 గంటలు ఉచిత కరెంటుతో ఇస్తుండడంతో రైతుల కు వ్యవసాయం ఈజీ అయింది. ఎవుసంపై మొగ్గు చూపే వారి సంఖ్య పెరిగింది. ఊర్లళ్ల కొనేవాళ్లు ఎక్కువవడంతో భూముల ధర ఎకరానికి రూ.30 లక్షల వరకు పలుకుతంది. గతంలో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలుండేది. మిషన్‌కాకతీయతో చెరువుల్లో నీళ్లుంటున్నయ్. బావుల్ల భూగర్భజలాలు పెరిగినయ్. పంటల సాగు ఎక్కువైంది. రైతులు రందీ లేకుండా బతుకుతున్నరు. మళ్లీ కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే అరిగోస తప్పదు. వాళ్లు 24 గంటల కరెంటిస్తరా? 3 గంటలని ఇప్పుడే చెప్పవట్టె. మళ్లీ కరెంట్ కోతలు వచ్చి, నీళ్లు పారక ఎవుసం బందయితది. భూములు పడావు ఉంటయ్.. ధరలు అమాంతం పడిపోతయ్.
– కొత్త మధుసూదన్‌రెడ్డి, రైతు, వెన్కేపల్లి (సైదాపూర్)
రాత్రింబవళ్లు బాయి కాడనే ఉండాలె
వ్యవసాయంపై అవగాహన లేక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నరు. మూడు గంటల కరెంట్ ఇస్తే నీళ్లు అందక వేసిన పంట మొత్తం ఎండిపోతది. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు మళ్ల మూడు గంటల కరెంట్ ఇస్తే రాత్రింబవళ్లు బాయిల కాడనే ఉండాలి. కాంగ్రెసోళ్ల మాటలను రైతులు నమ్మడం లేదు. వాళ్లతో ఏ పని కాదు. రైతుల కోసం కేసీఆర్ సారు ఎన్నో పథకాలు తెచ్చిండు.సారు వస్తేనే రైతులంతా సంతోషంగా ఉంటరు.
-సంగమల్ల శ్రీనివాస్, జూబ్లీనగర్, (కరీంనగర్ రూరల్)
దరిదాపులకు కూడా రానివ్వద్దు
తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతో చాలా ప్రాధాన్యత ఉంది. పుష్కలంగా నీరిస్తుండడంతో బంగారంలంటి పంటలు పండిస్తున్నం. తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా ఆవిర్భవించడం గర్వకారణం. నిరంతర కరెంట్‌తో కష్టాలు తొలగినయ్. ఈ సర్కారు రైతులకే కాదు, వ్యాపార, వాణిజ్య వర్గాలకు అండగా నిలుస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ ఎనుకటిలెక్క అంధకారమే..అందుకే కాంగ్రెస్‌ను అధికారానికి దరిదాపులకు కూడా రానివ్వద్దు.
-శనిగరపు దామోదర్, రైతు (హుజూరాబాద్‌టౌన్)
కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తమంటున్రు.
ధరణి తీసేస్తే మళ్ల పటేల్, పట్వారీల చుట్టూ తిరుగాలే. దళారుల రాజ్యమొస్తది. అప్పట్లో పట్వారోళ్లు ఒకల భూములు ఇంకొకలకు రాసేటోళ్లు. దీంతో ఊల్లలో పంచాయిలయేటియి. భూముల కోసం కొట్టుక సచ్చినోళ్లు కూడ ఉన్నరు. కేసులు, కోర్టుల చుట్టూ తిరిగేటోళ్లు. కాంగ్రెసోళ్లు మళ్ల గసోంటి వ్యవస్థ తీసుకొస్తమంటున్రు. కేసీఆర్ సార్ తెచ్చిన ధరణి మంచిగుంది. ధరణితో పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు అయితున్నయి. ఎనకటి లెక్క ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుడు లేదు. మన వేలిముద్ర పెడితేనే ఇంకొకరికి పట్టా అయితది. మనకు తెలువకుండా ఏం పని కాదు. కాంగ్రెసోళ్లు ధరణి తీసేసి భూమాత పోర్టల్ తెస్తరట. అందులో కౌలుదారు కాలమ్ , అనుభవదారు కాలమ్ పెడుతరట. అట్లయితే మళ్ల ఒకరి భూములు ఇంకొకరికి రాసుడైతది. మళ్ల పాత రోజులు వస్తే భూములకు భద్రత ఉండదు. అందుకే రైతులే కాదు.. కాంగ్రెసోళ్లను ఎవరూ నమ్మరు. కేసీఆర్ సార్ అన్ని రకాలుగా మంచిగా చేస్తుండు. చెక్‌డ్యామ్‌లు కట్టడంతో నీళ్ల సౌలత్ బాగా పెరిగి పంటలు కూడా మంచిగా పండుతున్నయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో మాకు రందీ లేకుండా పోయింది. కేసీఆరే మళ్ల ముఖ్యమంత్రి కావాలి.
-కొమిరె లావణ్య, మహిళా రైతు, చెర్లభూత్కూర్((కరీంనగర్ రూరల్)
10 హెచ్‌పీ మోటర్ల ఖర్చు ఎవడు భరిస్తడు..
కాంగ్రెసోళ్లు చెప్పే 10 హెచ్‌పీ మోటర్లు, మూడు గంటల కరెంట్‌తో రైతులకు నష్టం జరుగుతది. మా గ్రామంలో ఇప్పటివరకైతే 10 హెచ్‌పీ మోటర్లను నేను సూడలే. 10 హెచ్‌పీ మోటర్లు వాడాలంటే వాటికి మళ్ల కనెక్షన్ వేరే తీసుకోవాలి. ఇప్పుడు ఇస్తున్న మోటర్ల కరెంట్ సరఫరా కెపాసిటి పెంచాలి. గ్రామంలో 5 హెచ్‌పీ మోటర్లకు మూడు కనెక్షన్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటది. మరీ 10 హెచ్‌పీ మోటర్లకైతే ప్రతి మోటర్‌కు ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లు డీడీలు చెల్లించాలి. మోటర్ కెపాసిటిని బట్టి బిల్లు వస్తుంది. ఉచిత కరెంట్ తీసేసి బిల్లు కట్టమంటే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఒక వేళ పాత ట్రాన్స్ఫార్మర్లను అట్లనే వాడితే లోవోల్టేజీతో మోటర్లు కాలిపోతయి. మన ప్రాంతంలో 10 హెచ్‌పీ మోటర్లకు రిపేర్ చేసే మెకానిక్‌లు కూడా దొరకరు. ఇట్లయితే ఇగ ఎవుసం సాగినట్లే. ఇంత ఖర్చు రైతు ఏడ నుంచి భరిస్తడు. మూడు గంటల కరెంటు సాలంటున్రు. ఆ కరెంట్‌తో ఒక్క దొయ్య అన్న పారతదా..?కాంగ్రెసోళ్లు తలా తోక లేకుండా మాట్లాడుతున్రు. వాళ్లకేమన్న బుద్ధి ఉండాలే. కేసీఆర్ సారు ఇప్పుడిస్తున్న 24 గంటల కరెంట్‌తోని మస్తు పంటలు పండుతున్నయి. పాములు, పురుగు పూచిన భయం మాకు ఉండదు. మా ఇంటోళ్లు ఇప్పుడే రాత్రిలు కడుపు నిండ నిద్రపోతున్రు. గతంలో కాంగ్రెసోళ్లు కాలంలో కంటి పై నిద్రలేని రోజులు గడిపినం. అలాంటి రోజులు మళ్లీ రావద్దని కోరుకుంటున్నం. మళ్ల కేసీఆర్ సారే రావాలి. మేం కేసీఆర్ సారుకే ఓటేస్తం.
– పెండ్యాల అవంతిక, మహిళా రైతు, చెర్లభూత్కూర్(కరీంనగర్ రూరల్)
కాంగ్రెస్‌ను రానివ్వం
పాతకాలం పద్ధతి మళ్లీ తెచ్చి రైతు పట్టాదారు పాసు పుస్తకం, రెవెన్యూ రికార్డుల్లో కౌలుదారులు, కబ్జాదారుల కాలం ఏర్పాటు చేస్తే భూ యజమానులకు, రైతులకు అన్యాయం జరుగుతది. గతంల కబ్జాదారుల కాలంతో ఇబ్బందులుండేవి. అప్పుడున్న రెవెన్యూ వ్యవస్థలో చాలా లొసుగులు ఉండేటియి. అధికారుల చుట్టూ, పట్వారీల చుట్టూ తిరిగిన సమస్య పరిష్కారమయ్యేది కాదు. పాత పద్ధతి తీసుకొస్తే, భూ యజమానులకు కౌలు రైతులతో, కబ్జాదారులతో సమస్యలొస్తయి. రైతులు కూడా కౌలుకు ఇవ్వడానికి ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. ప్రతి సంవత్సరం కౌలుదారును మార్చాల్సి వస్తది. కొత్త సమస్యలు వచ్చి పడుతయి తప్ప రైతులకు న్యాయం జరగదు. ఇవన్నీ ఆలోచించే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చిండు. ఇది మంచిగుంది. ఇప్పుడు రైతులు, భూయజమానుల, కౌలుదారులు సంతోషంగా ఉన్నరు. మళ్లీ పాత పద్ధతి తెస్తమంటున్న కాంగ్రెస్‌నే రానీయక పోతేనే మంచిది. మాకు కేసీఆర్ కావాలి. మళ్లీ బీఆర్ఎస్సే రావాలి.
– దాసరి మల్లారెడ్డి, ప్రశాంత్‌నగర్(కరీంనగర్ రూరల్)
మళ్లీ పల్లెల్లో పంచాయితీలే ..
ధరణి ఎత్తేస్తే మళ్లీ పంచాయితీలే ఉంటాయ్. 60 ఏండ్లు పాలించిన కాంగ్రేస్ రైతుల భూములకు రక్షణ లేకుండా చేసింది చాలదా. పట్వార్లకు చేతి వాటం ఇస్తే రికార్డులు తారుమారు చేసుకోవచ్చు. భూ రికార్డుల్లో పేర్లను, విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ధరణితో ఏ రికార్డుల్లో ఎంత భూమి ఉందో, ఏవరి పేరున ఉందో మన మోబైల్లోనే వివరాలు చూసుకోవచ్చు. అక్రమాలు జరిగితే మన మోబైల్‌కు సమాచారం అందుతుంది. పట్టా చేసుకోవల్సి వస్తే యజమాని వేలి ముద్రలు అవసరం కాబట్టి వేరే వారికి మార్చిడి చేయకుండా భద్రంగా ఉంటుంది. ధరణితో రికార్డులు భద్రం. భూముల ధరలు భారీగా పెరిగినాయ్. అధికారుల మోసాలు తగ్గినయ్. అమ్మినా, కొన్న సులభతరంగా రిజిస్ట్రేషన్లు అవుతున్నయ్.
-సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, రైతు, సదాశివపల్లి, కరీంనగర్
రైతుబంధు డబ్బులు ఎలా వస్తయి
తెలంగాణలో ధరణి వచ్చినంక రైతులకు పూర్తి భరోసా దొరికింది. అక్రమంగా ఒకరి భూమిని మరొకరి పైరు మీదకు మార్చడం లాంటి చర్యలకు అడ్డుకట్ట పడింది. ఇలాంటి ధరణిని తీసేస్తే మళ్లా దళారుల పెత్తనం మొదలవుతుంది. గతంలో కాంగ్రెస్ పాలనలో భూముల వ్యవహారం అస్తవ్యస్తంగా ఉండేది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణితో మా భూములు భద్రంగా ఉన్నాయి. రైతుబంధు డబ్బులు మా ఖాతాలో జమవుతున్నాయి. మళ్లీ రైతులను ఇబ్బందులపాలు చేసేందుకే కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తామంటున్నరు. ఇట్లయితే రైతుబంధు డబ్బులు ఎలా వస్తయి. భూములు ఒకరికి మరొకరు దున్నుకుంటారు. అలాంటి పరిస్థితులు రావద్దంటే రైతులకోసం పనిచేసే కేసీఆర్ ప్రభుత్వానికే మద్దతుగా ఉండాలి. కాంగ్రెసోళ్లకు గుణపాఠం చెప్పాలి.
-కొమ్మెర భూపతిరెడ్డి, రైతు గునుకులపల్లి(చిగురుమామిడి)