కోనరావుపేట, మే 25: రైతులు ఆరుగాలం కష్టపడి ధాన్యం పండిస్తే.. దానిని అమ్ముకోవడానికి రెండింతలు అరిగోస పడాల్సి వస్తున్నది. కొనుగోళ్లు, కాంటా వేసిన బస్తాలను తరలించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండడం.. అకాల వర్షాల కారణంగా కోనరావుపేట మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుప్పలతో పాటు బస్తాల్లోని ధాన్యం తడిసి మొలక వస్తోంది. దీంతో రైతులు రేయింబవళ్లు కేంద్రాల్లోనే ఉంటూ ఆరబోసేందుకు అరిగోస పడుతున్నారు. సన్న వడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుండడంతో రైతులు ఎక్కువగా కొనుగోలు కేంద్రాలనే ఆశ్రయించగా, ఇప్పటివరకు మిల్లులు కేటాయించకపోవడం, కేటాయించిన మిల్లులు ధాన్యం దించుకోకపోవడంతో సెంటర్లలోనే మూలుగుతోంది.
బోనస్ మాట దేవుడెరుగు వర్షాలతో అంతకంటే ఎక్కువగా నష్టపోయే పరిస్థితి దాపురించిందని రైతులు అందోళన చెందుతున్నారు. తడిసిన ప్రతి చివరి గింజనూ కొంటామని ప్రభుత్వం మాటల్లో తప్ప చేతల్లో ఎక్కడా చూపిస్తున్న దాఖలులేవు. తూకం వేసిన బస్తాలు 15 రోజులకు పైగా సెంటర్లలోనే ఉండిపోవడంతో ప్రతి లారీలో సుమారు 5 నుంచి 10 క్వింటాళ్ల తరుగు వస్తుంది. దీంతో మిల్లు నిర్వాహకులను అడిగితే సెంటర్ నిర్వాహకులకు తెలుసు అంటూ దాటవేస్తున్నారు. మండలంలోని వట్టిమల్ల, వెంకట్రావుపేట, కోనరావుపేట, నిజామాబాద్ గ్రామాలతో పాటు పలు గ్రామాలలో ధాన్యం రాశులు ఎక్కడివక్కడే పేరుకుపోయాయి. శివంగాళపల్లి, కోనరావుపేట, వట్టిమల్ల, మరిమడ్లతో పాటు పలు గ్రామాలకు చుట్టూ అటవీప్రాంతం కావడంతో వరిధాన్యం కుప్పలు పందుల పాలవుతున్నాయి.
నాకున్న రెండెకురాల పంట పొలంలో బోనస్ వస్తుందన్న ఆశతో సన్న వడ్లు పండించిన. సెంటర్లో ధాన్యం పోసి నెలరోజులు దాటింది. వారం కిందట వడ్లను కాంటా వేసిన్రు. 180 వరకు బస్తాలు అయినయ్. కానీ, ఇప్పటివరకు లోడ్ చేయలే. నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు బస్తాలు పూర్తిగా తడిసి, మొలకచ్చినయ్. వడ్లు ఎప్పుడు లోడ్ చేస్తరని అడిగితే మిల్లుల్లో వడ్లు నిండిపోయినయని, సన్న వడ్లు అవసరం లేదని మిల్లులోళ్లు సెంటరోళ్లతో చెపుతున్నరట. లారీలోళ్లు కూడా సన్న వడ్లు తీసుకెళ్తలేరు. అధికారులు సన్న వడ్లు లోడ్ చేయించి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలి.
-భువనగిరి పర్శయ్య, రైతు, (కోనరావుపేట)